Aseem Munir: పాక్ ఆర్మీ చీఫ్‌కు ప్రమోషన్‌పై స్పందించిన బీజేపీ నేత

Aseem Munir Promotion Sparks BJP Leaders Reaction
  • పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ పదోన్నతి
  • బీజేపీ నేత అమిత్ మాలవీయ ఘాటు విమర్శలు
  • "వైఫల్యానికి దక్కిన పురస్కారం" అంటూ మాలవీయ ఎద్దేవా
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసీమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పిస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. వైఫల్యాలకు కూడా బహుమతులు ఉంటాయా అంటూ ఆయన పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు అమిత్ మాలవీయ 'ఎక్స్' వేదికగా ఓ పోస్టు చేశారు.

"వైఫల్యానికి కూడా బహుమతులు లభిస్తాయనడానికి ఇదే నిదర్శనం" అంటూ అమిత్ మాలవీయ తన పోస్టును ప్రారంభించారు. "భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'తో పాకిస్థాన్ చావుదెబ్బ తింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలకూల్చాం. అంతేకాకుండా, 13 వైమానిక స్థావరాలు, పాకిస్థాన్ జాతీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాటు వందలాది డ్రోన్‌లను ధ్వంసం చేశాం. ఈ ఘటనలో ఆ దేశానికి చెందిన 70 మందికి పైగా సైనిక సిబ్బంది మరణించారు. మన దెబ్బ తట్టుకోలేక పాకిస్థానే కాల్పుల విరమణకు అభ్యర్థించింది" అని మాలవీయ పేర్కొన్నారు.

"అయినప్పటికీ, పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించారు. పదే పదే వైఫల్యాలు ఎదురైనప్పటికీ ఆనందాన్ని ఆస్వాదించే యువరాజు ఒకరు మాత్రమే ఉన్నారు. అది ఎవరో మనందరికీ తెలుసు" అంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

మునీర్‌కు పదోన్నతిపై పాక్ ప్రభుత్వ వివరణ

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆసీమ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించారు. భారత్‌తో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో ఆసీమ్ మునీర్ కీలక పాత్ర పోషించినందుకే ఆయనకు ఈ పదోన్నతి కల్పించినట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పదోన్నతితో, ఫీల్డ్ మార్షల్ హోదా పొందిన రెండో వ్యక్తిగా జనరల్ ఆసీమ్ మునీర్ పాకిస్థాన్ చరిత్రలో నిలిచారు.
Aseem Munir
Pakistan Army
Amit Malviya
BJP Leader
Operation Sindoor
India Pakistan Conflict

More Telugu News