Akshay Gupta: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య.. తన మామలా కనిపించడంతో చంపేశానన్న నిందితుడు!

Akshay Gupta Indian American Businessman Murdered in Texas
  • అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా హత్య
  • టెక్సాస్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా ఘటన
  • మరో భారతీయుడు దీపక్‌ కండేల్‌ కత్తితో దాడి
  • మామలా కనిపిస్తున్నాడనే కారణంతో హత్య
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అమెరికాలో భారత సంతతికి చెందిన యువ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న ఆయనపై మరో భారతీయుడే దాడి చేసి ప్రాణాలు తీశాడు. మృతుడిని అక్షయ్‌ గుప్తా (30)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, హెల్త్‌ టెక్‌ స్టార్టప్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడైన అక్షయ్‌ గుప్తా మే 14వ తేదీన ఆస్టిన్‌లోని ఒక బస్సులో ప్రయాణిస్తున్నారు. బస్సు వెనుక సీట్లో కూర్చుని ఉన్న ఆయనపై దీపక్‌ కండేల్‌ అనే మరో భారతీయుడు అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అక్షయ్‌ గుప్తాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటన జరిగిన తీరుపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అక్షయ్‌ గుప్తాకు, నిందితుడు దీపక్‌ కండేల్‌కు మధ్య ఎలాంటి ఘర్షణ కానీ, వాగ్వాదం కానీ జరగలేదని సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైంది. ఫుటేజీ ఆధారంగా నిందితుడు కండేల్‌ను గుర్తించి అరెస్టు చేశారు. అతనిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసుల విచారణలో నిందితుడు దీపక్‌ కండేల్‌ చెప్పిన కారణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అక్షయ్‌ గుప్తా తన మామలా కనిపించాడని, అందుకే కత్తితో పొడిచి చంపానని కండేల్ పోలీసుల విచారణలో చెప్పాడు. అక్షయ్‌ గుప్తా ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన పెన్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించి ఇటీవల మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లను కూడా కలిశారు.
Akshay Gupta
Indian American
Texas
Austin
Murder
Health Tech Startup
Crime
US News

More Telugu News