Anagani Satya Prasad: ఎసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్‌పై మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయాలు ఇలా..

Anagani Satya Prasad on Freehold Land Decisions by Cabinet Sub Committee
  • భూపరిపాలనలో సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం భేటీ 
  • పేదలకు  న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి అనగాని సత్యప్రసాద్
  • దాదాపు 3 లక్షల ఎకరాల భూములను గత ప్రభుత్వం   నిబంధలకు విరుద్దంగా ఫ్రీ హోల్డ్ చేసిందన్న మంత్రి అనగాని
పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన భూపరిపాలనలో సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, పి.నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండి ఫరూక్, టిజె భరత్ పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్ భూములు, 22ఎ నుండి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదాబైనామాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది.

పేదలకు న్యాయం జరిగేలా ఫ్రీ హోల్డ్ భూములపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఫ్రీ హోల్డ్ భూములను 10 కేటగిరీలుగా విభజించగా 8 కేటగిరీలకు మంత్రివర్గ ఉపసంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 3 లక్షల ఎకరాల భూములు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తన అనుయాయులకు ఫ్రీ హోల్డ్ చేసిందని అన్నారు. ఈ భూములపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో సీఎం చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఒకవేళ చట్టవిరుద్ధంగా పేదల భూములను ఫ్రీ హోల్డ్ చేసినప్పటికీ వాటిని తిరిగి లాక్కోవడం ఉండదని భరోసా ఇచ్చారు. అటువంటి పేదలకు మళ్లీ ఆ భూములను అసైన్ చేస్తామని పేర్కొన్నారు. మళ్లీ 20 ఏళ్ల తర్వాతనే ఆ భూములు ఫ్రీ హోల్డ్ చేయబడతాయన్నారు. 22ఎ నుండి భూముల తొలగింపుకు సంబంధించి ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కలెక్టర్లు పని చేస్తున్నారా లేదా అనేది మంత్రి వర్గ ఉపసంఘం చర్చించిందన్నారు.

గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా కొన్ని భూములను 22ఎలో పెట్టారని, కొన్ని భూములను వారి అనుయాయుల ప్రయోజనం కోసం 22ఎ నుండి తొలగించారన్నారు. వీటన్నింటినీ పరిశీలించి నిజమైన భూ యజమానికి, పేదలకు నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. ఇక నుండి కొత్తగా భూములను 22ఎలో పెట్టాలంటే ఎవరికీ అన్యాయం జరగకుండా ఒక విధానాన్ని రూపొందించామని, సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్న తర్వాత దాన్ని అమల్లోకి తెస్తామని తెలిపారు.

నాలా చట్టం రద్దు పైన కూడా కూలంకుషంగా చర్చించామని, సూత్రప్రాయంగా సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు నాలా రద్దుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అయితే వాగులు, వంకలు, చెరువుల్లో కట్టడాలు నిర్మించి వర్షాలు, వరదలకు అవి మునిగిపోయే పరిస్థితి రానీయకుండా చూసేందుకు ఏఏ నిబంధనలు పెట్టాలనే దానిపై చర్చించామన్నారు. ఇక ఎప్పటి నుండో సమస్యగా ఉన్న సాదాబైనామాలపై కూడా ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సాదాబైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు ఉన్న గడువును 2024 నుండి 2027 వరకు పొడిగించామన్నారు. మరోసారి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై భూపరిపాలనలో ఇతర అంశాలకు సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చిస్తామని మంత్రి అనగాని తెలిపారు. 
Anagani Satya Prasad
AP Revenue Department
Freehold lands
Land reforms
22A lands
Nala Act
Sada Bainamas
Andhra Pradesh
Chandrababu Naidu
Land administration

More Telugu News