Mallikarjun Kharge: పాకిస్థాన్‌తో చిన్నపాటి యుద్ధం చేస్తున్నామంటూ ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన బీజేపీ

Mallikarjun Kharge Comments on Pakistan BJP Reaction
  • పహల్గామ్ ఘటనపై ప్రధాని మోదీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తీవ్ర ఆరోపణలు
  • భద్రత కల్పించకపోవడం వల్లే 26 మంది చనిపోయారని విమర్శ
  • ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌తోనే ప్రధాని కశ్మీర్ ట్రిప్ రద్దు చేసుకున్నారని వ్యాఖ్య
  • ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఆగ్రహం
  • చిన్న యుద్ధాలంటూ సైన్యాన్ని కించపరిచారంటూ మండిపాటు
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరైన భద్రత కల్పించకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆయన ఆరోపించారు. ఉగ్రదాడికి సంబంధించి నిఘా వర్గాల నుంచి ముందే సమాచారం అందినందువల్లే ప్రధాని మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఖర్గే పునరుద్ఘాటించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

కర్ణాటక ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయనగర జిల్లా హోసాపేటలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. పహల్గామ్ వెళ్లిన పర్యాటకులకు పోలీసులు, బీఎస్‌ఎఫ్ లేదా సైన్యం నుంచి ఎలాంటి భద్రత కల్పించలేదని, దీని ఫలితంగానే 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగినా, భద్రతా వైఫల్యంపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు.

పాకిస్థాన్‌తో మనం చిన్నపాటి యుద్ధాలు చేస్తున్నామని, అయితే పాక్ మనల్ని తక్కువ అంచనా వేస్తూ, చైనా మద్దతుతో దాడులకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దాడులను దేశం ఎప్పటికీ సహించబోదని స్పష్టం చేశారు. ఈ విషయంలో దేశమంతా ఐక్యంగా ఉందని, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటంలో ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. దేశమే అన్నింటికన్నా ముఖ్యమని, ఆ తర్వాతే మతం, కులం వంటి అంశాలని అన్నారు.

అయితే, ప్రధాని పర్యటన సమయంలో నిఘా వర్గాలు సమాచారం అందించాయని, కానీ సామాన్య పౌరులను, పేదలను మాత్రం కాపాడుకోలేకపోయామని విచారం వ్యక్తం చేశారు. వివిధ దేశాలకు పార్లమెంటు సభ్యుల బృందాలను పంపించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ పార్టీని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అయినప్పటికీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మౌనంగా ఉన్నామని, మన దేశం తరఫున మాట్లాడేందుకు కాంగ్రెస్ ఎంపీలను పంపిస్తున్నామని ఖర్గే వివరించారు.

ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం

మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర తీవ్రంగా స్పందించారు. 'ఆపరేషన్ సిందూర్' వంటి సైనిక చర్యలను 'చిన్నపాటి యుద్ధం' అనడంపై ఆయన ధ్వజమెత్తారు. భారత సైన్యం పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి అక్కడి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా, వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. సైన్యం ధైర్యసాహసాలను కించపరిచేలా ఖర్గే మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge
Pahalgam attack
Kashmir terror attack
Samba Patra BJP
India Pakistan
Congress party

More Telugu News