Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన .. అధికారుల గుండెల్లో గుబులు

Chandrababu Naidu Announces Surprise Inspections in AP
  • జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని పేర్కొన్న సీఎం చంద్రబాబు
  • ప్రజలకు అందించే సేవల్లో పూర్తిస్థాయి సంతృప్తి రావాల్సిందేనని వెల్లడి
  • ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని సూచన  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జూన్ 12 తర్వాత ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుతున్న రేషన్, దీపం, ఏపీఎస్‌ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, సీఎంవో కార్యదర్శులతో సమీక్షించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజా సేవల విషయంలో పూర్తి స్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, అయితే ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో నాణ్యత పెరగాల్సి ఉందని సీఎం అన్నారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని సీఎం అన్నారు. లబ్ధిదారులు తమకు కావలసినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ పొందవచ్చు, అయితే వారికి మూడు సిలిండర్లకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం ముందుగానే చెల్లిస్తుందన్నారు.

రేషన్ సరుకుల పంపిణీపై అభిప్రాయాలు పరిశీలిస్తే, "మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా?" అని ప్రశ్నించగా 74 శాతం మంది అవునని, వాటి నాణ్యత ఎలా ఉంది అంటే బాగుందని 76 శాతం మంది చెప్పారన్నారు. రేషన్ పంపిణీలో, నాణ్యతపై ప్రజల సంతృప్తిలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. అదే విధంగా గ్యాస్ డెలివరీ సమయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే అంశంలో 62 శాతం మంది లేదని, పలు చోట్ల ఈ విషయంలో సమస్య ఉందని చెప్పారన్నారు. ఆర్టీసీ సేవల విషయంలో ప్రయాణికుల నుంచి ఆశించిన స్థాయిలో సంతృప్తి వ్యక్తం కాలేదని, ఈ విషయంలో అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు. బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ విషయంలో ప్రయాణికుల నుంచి అసంతృప్తి వస్తోందని దీన్ని సరిచేసుకోవాలని సీఎం సూచించారు.

తాగునీటిపై 44 శాతం, టాయిలెట్లపై 55 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు . ఇక పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి, ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతుందా అనే ప్రశ్నకు 60 శాతం మంది అవుననే చెప్పారని, గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైందని సీఎం అన్నారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడిచెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి, కంపోస్ట్ తయారీ చేపడతామని సీఎం తెలిపారు.

ప్రభుత్వ సేవల్లో డాటా అనలిటిక్స్ కీలకమని సీఎం అన్నారు. డాటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖలు తమ పనితీరును క్షేత్ర స్థాయి నుంచి పరిశీలించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమర్థవంతంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్నారు. ఒక ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతున్న సందర్భంలో వాటికి కారణాలను తెలుసుకుని దానికి అనుగుణంగా అధికారులు, ఉద్యోగులు పనిచేయాలన్నారు. ప్రతి శాఖలో ఉన్నతాధికారులు ఆయా శాఖలపై వచ్చే డాటాపై అనలిటిక్స్ ద్వారా సేవలను మెరుగుపరచాలని సీఎం సూచించారు.

ఇదంతా బాగానే ఉన్నా జూన్ 12 నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు సీఎం ప్రకటించడంతో అధికారుల గుండెల్లో ఇప్పటి నుంచే గుబులు రేగుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి ఆకస్మిక పర్యటనలకు వచ్చిన సమయంలో ప్రజలు నేరుగా అధికారులపై ఫిర్యాదు చేసే అవకాశాలు ఉండటంతో వారిలో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
surprise inspections
government services
ration distribution
APSRTC
public feedback
data analytics
Diipam scheme

More Telugu News