Tanguturi Prakasam Pantulu: బ్రిటీష్ తుపాకికి గుండెను చూపిన ఆయన సాహసం మరువలేం: చంద్రబాబు
- నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి
- నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు
- ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత అన్న చంద్రబాబు
ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ... "ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిరుపేద కుటుంబంలో పుట్టి, రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా వెలుగొంది, ‘ఆంధ్రకేసరి’గా కీర్తిప్రతిష్టలు పొందిన ఆ మహనీయుడు మనందరికి స్ఫూర్తి ప్రదాత. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో పాల్గొని బ్రిటీష్ తుపాకికి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేం. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగనిరతి ఆదర్శవంతం. ఆయనకు మరొక్కమారు ఘన నివాళి ఘటిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.