Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గూఢచర్యం కేసు.. విలాసాల వెనుక చీకటి కోణాలు!

YouTuber Jyoti Malhotra Espionage Case Dark Angles Behind Luxuries
  • గూఢచర్యం ఆరోపణలతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్
  • ఆదాయానికి మించిన విలాసవంతమైన జీవనశైలిపై అనుమానాలు
  • పాకిస్థాన్, చైనా పర్యటనలు.. ఖరీదైన హోటళ్లలో బస
  • పహల్గామ్ పర్యటన తర్వాత ఉగ్రదాడి.. వీడియోల బదిలీపై ఆరా
  • పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో సన్నిహిత సంబంధాలు
  • ఢిల్లీ పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫొటో వైరల్
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె గడుపుతున్న విలాసవంతమైన జీవితం, తరచూ సాగించిన పాకిస్థాన్ పర్యటనలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఆమె ఆదాయ వనరులకు, ఖరీదైన జీవనశైలికి పొంతన లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమాన ప్రయాణాల్లో సైతం ఫస్ట్ క్లాస్‌లోనే ప్రయాణించినట్లు సమాచారం. ఖరీదైన హోటళ్లలో బస చేయడం, ప్రముఖ రెస్టారెంట్లలోనే భోజనం చేయడం వంటివి ఆమె జీవనశైలిలో భాగంగా మారాయి. జ్యోతి పాకిస్థాన్ పర్యటన ఖర్చులన్నీ స్పాన్సర్లే భరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఆమె చైనాకు కూడా వెళ్లినట్లు తేలింది. అక్కడ కూడా విలాసవంతమైన కార్లలో తిరగడం, ఖరీదైన నగల దుకాణాలను సందర్శించడం వంటివి చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

ఈ ఏడాది జనవరిలో జ్యోతి మల్హోత్రా కశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో పర్యటించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ పర్యటన జరిగిన మూడు నెలల వ్యవధిలోనే అక్కడ ఉగ్రదాడి జరగడం గమనార్హం. ఐదు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గామ్ వెళ్లి, అక్కడ పలు వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియోలను పాక్ ఏజెంట్లకు చేరవేసిందా? పహల్గామ్ ఉగ్రదాడికి, జ్యోతి పర్యటనకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నిలిపివేశారు. జ్యోతికి చెందిన సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్న తర్వాత పలు అనుమానాస్పద అంశాలు వెలుగుచూశాయని పోలీసులు తెలిపారు.

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలోనూ జ్యోతి ఢిల్లీలోని పాక్ ఎంబసీ అధికారి డానిష్‌తో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. డానిష్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల తర్వాత, ఏప్రిల్ 24న ఢిల్లీలోని పాక్ ఎంబసీకి గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి కేక్ తీసుకువస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అక్కడున్న విలేకరులు ‘ఎందుకు వచ్చావు? ఎందుకోసమని ఈ కేక్?’ అని ప్రశ్నించగా.. ఆ వ్యక్తి సమాధానం చెప్పకుండా వేగంగా లోపలికి వెళ్లిపోయాడు. ఈ గడ్డం వ్యక్తితో జ్యోతి మల్హోత్రా దిగిన ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో జ్యోతి హాజరైన ఒక వేడుక వీడియోలో కూడా ఈ వ్యక్తి కనిపించాడు. వీడియోలో జ్యోతి ఆ వ్యక్తిని కలిసినట్లు స్పష్టంగా ఉంది.

ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో కూడా జ్యోతికి సంబంధాలున్నాయని, వారిలో కొందరికి పాకిస్థానీ ఏజెంట్లతో కూడా పరిచయాలు ఉన్నాయని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ తెలిపారు. పాకిస్థాన్ ఏజెంట్లు తమ వాదనను ప్రచారం చేసుకునేందుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Jyoti Malhotra
YouTuber Jyoti Malhotra
espionage case
Pakistan
China
Pahalgam terror attack
Operation Sindoor
Pak embassy
social media influencers
Danish Pak embassy

More Telugu News