Niloufer Hospital: నిలోఫర్ ఆసుపత్రి వైద్యుల ఘనత.. సూదితో పొడవకుండానే రక్త పరీక్ష!

Niloufer Hospital Pioneers Needle Free Blood Test with Face Scan
  • ఏఐ ఆధారిత పీపీజీ టెక్నాలజీతో కొత్త పరికరం
  • నిమిషంలోపే ముఖం స్కాన్ చేసి రిపోర్టులు
  • బీపీ, ఆక్సిజన్, హిమోగ్లోబిన్ వంటివి గుర్తింపు
  • వెయ్యి మంది పిల్లలపై రెండు నెలల పాటు ప్రయోగం
  • ‘అమృత్ స్వస్థ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు
హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నిలోఫర్ ఆసుపత్రి వైద్యరంగంలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇకపై సూదితో పొడిచి రక్తం తీయాల్సిన అవసరం లేకుండా కేవలం ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా నిమిషంలోపే కీలకమైన ఆరోగ్య వివరాలు తెలుసుకునే అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వినూత్న ఏఐ ఆధారిత డయాగ్నొస్టిక్ (ఫొటో ప్లెథిస్మోగ్రఫీ - పీపీజీ) సాధనాన్ని ప్రవేశపెట్టారు.

‘అమృత్ స్వస్థ్ భారత్‌’లో భాగంగా.. 
‘అమృత్ స్వస్థ్ భారత్’ కార్యక్రమంలో భాగంగా క్విక్ వైటల్స్ అనే సంస్థ ఈ అత్యాధునిక పీపీజీ పరికరాన్ని అభివృద్ధి చేసింది. నిన్న నిలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ దీనిని అధికారికంగా ప్రారంభించారు. సంప్రదాయ రక్తపరీక్షలకు సమయం పట్టడంతో పాటు, రిపోర్టుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త పరికరంతో ఆ ఇబ్బందులకు తెరపడనుంది.

పనితీరు ఇలా.. 
ఈ పీపీజీ పరికరం పనితీరు చాలా సులభం. ఎల్‌ఈడీ ట్రైపోడ్‌కు అమర్చిన ఈ పరికరంతో అనుసంధానించిన సెల్‌ఫోన్ స్క్రీన్ వైపు రోగులు 30 నుంచి 40 సెకన్ల పాటు చూస్తే చాలు. వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా పరికరం కేవలం నిమిషంలోపే అనేక ఆరోగ్య వివరాలను అందిస్తుంది. రక్తపోటు (బీపీ), రక్తంలో ఆక్సిజన్ స్థాయులు (ఎస్‌పీఓ2), హార్ట్‌ బీట్, శ్వాసక్రియ రేటు, హెచ్‌ఆర్‌వీ (హార్ట్ రేట్ వేరియబిలిటీ), ఒత్తిడి స్థాయులు, హిమోగ్లోబిన్ శాతం, పల్స్ రెస్పిరేటరీ కోషెంట్, సింపథిటిక్, పారాసింపథిటిక్‌ నాడీ వ్యవస్థల పనితీరు వంటి అనేక కీలక ఆరోగ్య సూచికలను ఈ పరికరం విశ్లేషించి అందిస్తుంది.

ప్రయోగాత్మక పరిశీలన అనంతరం విస్తరణ 
ఈ సందర్భంగా నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ‘మొదటి దశలో భాగంగా రెండు నెలల పాటు సుమారు వెయ్యి మంది పిల్లలకు ఈ పరికరంతో పరీక్షలు నిర్వహిస్తామని, వారి నుంచి సేకరించిన రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ అత్యాధునిక విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వానికి నివేదిస్తామని వివరించారు. ఈ విధానం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు సూది నొప్పి భయం లేకుండా సులభంగా పరీక్షలు చేయించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.
Niloufer Hospital
Hyderabad
blood test
photo plethysmography
PPG
Quick Vitals
Dr Ravikumar
healthcare technology
AI diagnostics

More Telugu News