Pawan Kalyan: రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై అప్రమత్తత అవసరం: సీఎస్, డీజీపీలకు పవన్ కల్యాణ్ లేఖ

Pawan Kalyan Alerts on Terrorist Activities in Andhra Pradesh
  • తీర ప్రాంత జిల్లాల్లో  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్న పవన్
  • రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరుల ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
  • దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టీకరణ
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీస్ శాఖ, పరిపాలనా శాఖలకు సూచించారు. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, రాష్ట్ర డీజీపీకి లేఖలు రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందనీ, దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని చెప్పారు. 

విజయనగరంలో ఒక యువకుడికి ఐఎస్ తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో మన రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, అలాంటివారి కదలికలపైనా అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై, ఎక్కడైనా ఉగ్ర నీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. 

ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. కాబట్టి తీర ప్రాంత నిఘా, తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరం అని ఆ లేఖలో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్ర దాడులు, తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతిపరులపై ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు. 

గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం అని.. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని పవన్ తన లేఖలో తెలిపారు. 

తన లేఖలో రోహింగ్యాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోందని.. ఇది ఆందోళనకర పరిణామం అని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని సూచనలు చేశారు. అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైన గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారా? లేదా? అనుమానిత వ్యక్తులు ప్రభుత్వ శాఖల నుంచి ఐడీ కార్డులు, ధ్రువపత్రాలు పొంది ఉంటే వాటిని ఎలా పొందారు? వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు? స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంతాంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. 

కొన్నేళ్ళ కిందట గుంటూరు, గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో ఎన్ఐఏ. దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుందని... ఈ విషయాన్నీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దేశ భద్రత, రక్షణ అనేవి ఈ తరుణంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని చెబుతూ... రాష్ట్ర పోలీసు యంత్రాంగం శాంతిభద్రతలతోపాటు అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలకి రాష్ట్రం సహకారం తోడవుతుందన్నారు. 

గతంలోనూ ప్రస్తావించిన పవన్ కల్యాణ్

కానాడలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై గతేడాది నవంబర్ నెలలో పరిశీలనకు వెళ్ళిన సందర్భంలోనూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దేశ అంతర్గత భద్రతను ప్రస్తావించారు. కాకినాడ జిల్లా రెవెన్యూ, పోలీస్, పోర్టు అధికారులతో మాట్లాడుతూ తీర ప్రాంతంలో నిఘా వ్యవస్థ సక్రమంగా లేని పక్షంలో అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తావించిన అంశాలపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వెంటనే సానుకూలంగా స్పందించింది. అందుకు అనుగుణంగా కేంద్ర నిఘా వర్గాలు తక్షణమే చర్యలకు ఉపక్రమించాయి.

Pawan Kalyan
Andhra Pradesh
Terrorism
NIA
Rohingya
Sleeper Cells
Operation Sindoor
AP Police
National Security
Illegal Immigrants

More Telugu News