Operation Sindoor: పాక్ కు ఆపరేషన్ సిందూర్ వివరాలను లీక్ చేసిన ముఠా గుట్టురట్టు

Operation Sindoor Details Leaked Pakistan Gang Busted
  • పంజాబ్‌లో పాక్ గూఢచర్య నెట్‌వర్క్ భగ్నం
  • ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • 'ఆపరేషన్ సిందూర్' వివరాలు ఐఎస్ఐకి లీక్
  • సైనిక కదలికలు, వ్యూహాత్మక స్థలాల సమాచారం చేరవేత
  • ఖాతాల్లోకి లక్ష రూపాయలు బదిలీ అయినట్లు గుర్తింపు
దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న మరో గూఢచర్య ముఠా గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాకిస్థాన్‌కు రహస్యాలు చేరవేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

అరెస్టయిన వారిని గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరి వయసు 19 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని వెల్లడించారు. ఈ యువకులు 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన సున్నితమైన వివరాలతో పాటు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో భారత సైనిక దళాల కదలికలు, ఇతర వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాల సమాచారాన్ని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చేరవేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో వీరి మొబైల్ ఫోన్లను తనిఖీ చేయగా, పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న విషయం స్పష్టమైందని వివరించారు.

నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఎనిమిది లైవ్ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ యువకుల బ్యాంకు ఖాతాల్లోకి లక్ష రూపాయలు జమ అయినట్లు బోర్డర్ రేంజ్ డీఐజీ సతీందర్ సింగ్ పేర్కొన్నారు.

గత 20 రోజులుగా వీరు పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. గురుదాస్‌పూర్ పోలీసులు ఈ గూఢచర్య ముఠాను విజయవంతంగా ఛేదించారని డీఐజీ వెల్లడించారు. పట్టుబడిన యువకులు మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని కూడా ఆయన వెల్లడించారు. నిందితులపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Operation Sindoor
Sukhpreet Singh
Karanbir Singh
Punjab Police
ISI
Pakistan Espionage

More Telugu News