Canary Islands: మా దీవులలో పర్యటించొద్దు ప్లీజ్.. కేనరీ ఐలాండ్ ప్రజల నిరసన ర్యాలీ.. వీడియో ఇదిగో!

Canary Islands Residents Protest Against Overtourism
  • మాస్ టూరిజంపై మండిపడుతున్న స్పెయిన్ దీవుల ప్రజలు
  • టూరిస్టుల వల్ల తాము ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తోందంటున్న స్థానికులు
  • పర్యాటకాన్ని నియంత్రించాలంటూ భారీ నిరసనలు.. వేలాదిగా రోడ్లపైకి జనం
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పర్యాటకులను రారమ్మని పిలుస్తుంటే స్పెయిన్ లోని కేనరీ ఐలాండ్ ప్రజలు మాత్రం మా దీవికి రావొద్దని చెబుతున్నారు. టూరిస్టుల రాకను నియంత్రించాలంటూ ఏకంగా రోడ్లపైకి వచ్చి మరీ ఆందోళన చేస్తున్నారు. అపరిమిత పర్యాటకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్లువలా వస్తున్న పర్యాటకులను నియంత్రించాలని, తమ దీవులను కాపాడుకోవాలని డిమాండ్ తో ఆదివారం వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆఫ్రికా వాయువ్య తీరంలో ఉన్న ఈ ఏడు దీవుల సమూహంలో "కేనరీస్ తినే ఉన్ లిమిటె" (కేనరీలకు ఓ హద్దుంది) అంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

"కేనరీ దీవులు అమ్మకానికి లేవు", "కేనరీ దీవులు ఇక స్వర్గం కాదు" వంటి నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. అపరిమిత పర్యాటకం వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు, స్థానికులకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అద్దెలను నియంత్రించాలని, కొత్త పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అతిపెద్ద దీవి అయిన టెనెరిఫేలో 7,000 మంది, గ్రాన్ కెనరియాలో 3,000 మంది, లాంజరోట్‌లో 1,500 మంది, ఫ్యూర్టెవెంచురాలో 1,000 మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

పర్యాటక రంగం వల్ల దీవుల్లో ప్రతి పది మందిలో నలుగురికి ఉపాధి లభిస్తోందని, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36 శాతం వాటా ఇదే రంగం నుంచి వస్తోందని గణాంకాలు చెబుతున్నప్పటికీ, తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, స్థానికుల జీవన ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణను విస్మరిస్తున్నారని వారు మండిపడ్డారు.

ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉండగా స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే స్పెయిన్‌కు రికార్డు స్థాయిలో 171 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. సుమారు 22.4 లక్షల జనాభా ఉన్న కేనరీ దీవులు 43.6 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఆతిథ్యమిచ్చాయి. 2024లో నమోదైన 152 లక్షల మంది పర్యాటకుల సంఖ్యను ఈ ఏడాది అధిగమించే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో పర్యాటకాన్ని నియంత్రించకపోతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Canary Islands
Spain
Overtourism
Protest
Tourism
Environmental Concerns
Sustainable Tourism
Travel
Canary Islands Protest
Mass Tourism

More Telugu News