Klarna: ఏఐ కన్నా మనుషులే మేలంటున్న స్వీడిష్ కంపెనీ

Swedish Fintech Firm Klarna Prefers Humans Over AI
  • రెండేళ్ల క్రితం తొలగించిన ఉద్యోగులను తిరిగి రమ్మంటున్న వైనం
  • కృత్రిమ మేధతో పనిలో నాణ్యత తగ్గిపోయిందని వెల్లడి
  • ఏఐ కస్టమర్ ఏజెంట్ల పనితీరుపై కంపెనీ అసంతృప్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో స్వీడన్ కు చెందిన ఓ కంపెనీ మాత్రం మనుషులను నియమించుకోవడానికే మొగ్గు చూపుతోంది. రెండేళ్ల క్రితం ఇదే కంపెనీ ఏఐ సేవలను విస్తృతంగా ఉపయోగించుకుంటూ ఉద్యోగులను తొలగించింది. రెండేళ్ల పాటు వినియోగించుకున్న తర్వాత ఏఐ సేవల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏఐ కంటే మనుషులే మేలని చెబుతూ గతంలో తొలగించిన ఉద్యోగులను వెనక్కి రమ్మని పిలుస్తోంది. 

స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ క్లార్నా తాజాగా ఈ ప్రకటన చేసింది. కృత్రిమ మేధ ఆధారిత కస్టమర్ సేవా ఏజెంట్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పేర్కొంది.  రెండేళ్ల క్రితం ఖర్చులు తగ్గించుకుని, సామర్థ్యం పెంచుకునేందుకు ఓపెన్‌ఏఐతో జతకట్టి ఏఐ వినియోగాన్ని భారీగా పెంచిన క్లార్నా, ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచిస్తోంది. 

క్లార్నా సీఈఓ సెబాస్టియన్ సిమియాట్‌కోవ్స్కీ మాట్లాడుతూ.. ఏఐ ఏజెంట్ల సేవల నాణ్యత తక్కువగా ఉందన్నారు. "ఖర్చు తగ్గించుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల సేవల నాణ్యత దెబ్బతింది. వినియోగదారులకు అవసరమైనపుడు వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఒక మనిషి అందుబాటులో ఉంటాడనే భరోసా ఇవ్వడం కంపెనీ బ్రాండ్‌కు చాలా ముఖ్యం" అని ఆయన స్పష్టం చేశారు.

2023లో క్లార్నా కొత్త నియామకాలను పూర్తిగా నిలిపివేసి, ఏఐ వినియోగాన్ని విస్తృతం చేసింది. అనువాదం, ఆర్ట్ ప్రొడక్షన్, డేటా విశ్లేషణ వంటి పనులను ఏఐకి అప్పగించడం ద్వారా 10 మిలియన్ డాలర్లు ఆదా చేశామని గతంలో సిమియాట్‌కోవ్స్కీ గొప్పగా చెప్పుకున్నారు. అంతేకాదు, 700 మంది కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల పనిని ఏఐ చేస్తోందని కూడా తెలిపారు.

అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కంపెనీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. డిసెంబర్ 2022 చివరి నాటికి 5,527 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్న క్లార్నాలో, గత ఏడాది డిసెంబర్ నాటికి ఆ సంఖ్య 3,422కు పడిపోయిందని కంపెనీ ఐపీఓ ప్రాస్పెక్టస్‌లో వెల్లడించింది. ఏఐ వల్ల నాణ్యత లోపించిందని గుర్తించిన క్లార్నా, ఇప్పుడు తిరిగి మానవ వనరుల వైపు మొగ్గు చూపడం గమనార్హం.
Klarna
Sebastian Siemiatkowski
Artificial Intelligence
AI in Customer Service
AI drawbacks
Human Workforce
Fintech
Sweden
OpenAI
Cost Reduction

More Telugu News