Nikhil Somavanshi: 25 ఏళ్ల టెకీని బలితీసుకున్న బెంగళూరు వర్క్ కల్చర్!

25 Year Old Techies Death Highlights Toxic Bengaluru Work Culture
  • బెంగళూరులో ఓలా ఏఐ కంపెనీ కృత్రిమ్‌లో విషాదం
  • సరస్సులో శవమై తేలిన 25 ఏళ్ల మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ 
  • కంపెనీలో విషపూరిత పని వాతావరణంపై రెడిట్‌లో పోస్టులు
  • సెలవులో ఉన్నప్పుడే ఘటన జరిగిందన్న కృత్రిమ్ యాజమాన్యం
  • మేనేజర్‌పై పలువురు మాజీ, ప్రస్తుత ఉద్యోగుల తీవ్ర ఆరోపణలు
బెంగళూరులోని ప్రముఖ రైడ్ సేవల సంస్థ ఓలాకు చెందిన కృత్రిమ్ ఏఐ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువ మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సంస్థలోని పని ఒత్తిడి, ఓ మేనేజర్ అనుచిత ప్రవర్తన కారణంగానే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో, పలు మీడియా కథనాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కృత్రిమ్ ఏఐ కంపెనీలో మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నిఖిల్ సోమవంశీ (25) మృతదేహం ఈ నెల 8వ తేదీన బెంగళూరులోని అగర సరస్సులో లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిఖిల్, బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వెంటనే గత ఏడాది ఆగస్టులో కృత్రిమ్‌లో చేరారు.  

అయితే, కంపెనీలోని అమెరికాలో ఉంటున్న మేనేజర్ రాజ్‌కిరణ్ పనుగంటి ప్రవర్తన కారణంగా పలువురు ఉద్యోగులు రాజీనామా చేయగా, వారి పనుల భారం కూడా నిఖిల్‌పై పడిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'కిర్గావాకుట్జో' అనే రెడిట్ యూజర్ చేసిన ఓ పోస్టులో సదరు మేనేజర్ రాజ్‌కిరణ్ కొత్తగా చేరిన ఉద్యోగులతో చాలా దురుసుగా మాట్లాడేవారని, భయానక వాతావరణం సృష్టించేవారని, ఆయన తీరు వల్లే చాలా మంది ఉద్యోగులు కంపెనీని వదిలి వెళ్లిపోయారని పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై కృత్రిమ్ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. నిఖిల్ మృతి తమను తీవ్రంగా కలచివేసిందని, తాము అధికారుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన సమయంలో నిఖిల్ సెలవులో ఉన్నాడని కంపెనీ ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ‘ఏప్రిల్ 8న నిఖిల్ తన మేనేజర్‌ను సంప్రదించి తనకు విశ్రాంతి అవసరమని కోరగా, వెంటనే వ్యక్తిగత సెలవు మంజూరు చేశాం. తర్వాత ఏప్రిల్ 17న తాను బాగున్నానని, అయితే మరికొంత విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెప్పడంతో సెలవును పొడిగించాం’ అని కంపెనీ వివరించింది.

అయితే, నిఖిల్ మరణం గురించి తెలిసిన తర్వాత కూడా సదరు మేనేజర్ మిగిలిన ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించడం మానలేదని రెడిట్ యూజర్ ఆరోపించారు. పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు కృత్రిమ్ ఉద్యోగులు కూడా మేనేజర్ ప్రవర్తన చాలాకాలంగా దూకుడుగా, అవమానకరంగా ఉండేదని, జూనియర్ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడుతూ వారిని అసమర్థులుగా ముద్ర వేసేవారని మీడియాకు తెలిపారు.

బిజినెస్ స్టాండర్డ్ కథనం ప్రకారం.. ఓ మాజీ కృత్రిమ్ ఉద్యోగి ఈ ఆరోపణలను ధ్రువీకరించారని, తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడంతో మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేశానని చెప్పినట్టు తెలిసింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. మేనేజర్ రాజ్‌కిరణ్ పనుగంటితో కలిసి పనిచేసిన మరో మాజీ ఉద్యోగి.. ‘రాజ్‌కిరణ్‌కు ఉద్యోగులను ఎలా చూడాలో తెలియదు. మీటింగ్‌లలో ఉద్యోగులపై అరుస్తారు. తర్వాత కనపడకుండా పోతారు. ఆయన మాటలు చాలా బాధించేవి’ అని చెప్పినట్టు పేర్కొంది.

ఇలాంటి ఘటనలు గతంలో కూడా వెలుగుచూశాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీలో పనిచేసిన 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ గుండెపోటుతో మరణించగా, తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పని గంటలే ఆమె మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే, బజాజ్ ఫైనాన్స్‌లో పనిచేసిన 42 ఏళ్ల ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటూ తన చావుకు పైఅధికారులు, పని ఒత్తిడే కారణమని లేఖలో పేర్కొన్నాడు. తాజా ఘటనతో కార్పొరేట్ కంపెనీలలో పని వాతావరణం, ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Nikhil Somavanshi
Kritirn AI
Bengaluru Work Culture
Ola
Raj Kiran Panuganti
Tech Employee Suicide
Work Pressure
Mental Health
Toxic Workplace
Indian Institute of Science

More Telugu News