Rajnath Singh: భారత సైన్యానికి కీలక అధికారాలు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం

Indian Govt Grants Key Powers to Armed Forces
  • త్రివిధ దళాలకు అత్యవసర ఆయుధ కొనుగోలు అధికారాల మంజూరు
  • సుమారు రూ.40,000 కోట్ల బడ్జెట్‌కు రక్షణ కొనుగోళ్ల మండలి ఆమోదం
  • ఆయుధ నిల్వల భర్తీ, ఆధునిక ఆయుధాల సమీకరణే ప్రధాన లక్ష్యం
  • పాక్‌తో ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ లో వ్యూహాత్మక విరామం నేపథ్యంలో ఈ నిర్ణయం
  • 40 రోజుల్లో ఒప్పందాలు ఖరారు, ఏడాదిలోగా ఆయుధాల డెలివరీ పూర్తి
పాకిస్థాన్ తో ఇటీవలి ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతుండడం వంటి అంశాల నేపథ్యంలో... కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాలకు కీలక అధికారాలను అప్పగించింది. అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సుమారు రూ.40,000 కోట్ల పరిమితితో అత్యవసర ఆయుధ సేకరణ (ఎమర్జెన్సీ ప్రొక్యూర్‌మెంట్ - ఈపీ) అధికారాలను త్రివిధ దళాలకు కల్పిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) కొద్ది రోజుల క్రితమే ఆమోదముద్ర వేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ తాజా నిర్ణయం (ఈపీ-6) ద్వారా ఆర్మీ, వైమానిక దళం (ఐఏఎఫ్), నౌకాదళం తమ ఆయుధ నిల్వలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, ఖాళీ అయిన వాటిని తిరిగి భర్తీ చేసుకోనున్నాయి. గతంలో తూర్పు లఢఖ్‌లో చైనాతో సైనిక ఘర్షణల సమయంలో తొలి నాలుగు దఫాలుగా, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం ఐదో దఫా అత్యవసర కొనుగోలు అధికారాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ఆరో విడత అధికారాల కింద, సాయుధ దళాలు సాధారణంగా అనుసరించే సుదీర్ఘమైన సేకరణ ప్రక్రియలకు బదులుగా, వేగవంతమైన పద్ధతిలో ఒక్కొక్కటి రూ.300 కోట్ల విలువైన బహుళ ఒప్పందాలను ఖరారు చేసుకోవచ్చు. ఈ కొనుగోళ్లను మూలధన, రెవెన్యూ పద్దుల కింద చేపట్టే వెసులుబాటు కల్పించారు. "ఒప్పందాలను 40 రోజుల్లోగా ఖరారు చేయాల్సి ఉంటుంది, ఏడాదిలోగా ఆయుధాల డెలివరీ పూర్తి కావాలి. ఈ అధికారాలను త్రివిధ దళాల వైస్ చీఫ్‌లు వినియోగిస్తారు" అని ఓ అధికారి తెలిపారు.

ఈ అత్యవసర అధికారాలతో క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, నిఘా మరియు కచ్చితత్వంతో దాడులు చేయగల మందుగుండు సామగ్రి, కమికాజే డ్రోన్లు, డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు వంటి అధునాతన ఆయుధాలను, ఇతర మందుగుండు సామాగ్రిని సాయుధ దళాలు వేగంగా సమకూర్చుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తం రక్షణ బడ్జెట్‌లో మూలధన, రెవెన్యూ సేకరణలపై ఒక్కొక్కదానిపై 15% పరిమితి ఉంటుందని తెలుస్తోంది. 

ఇటీవల పాక్ తో ఘర్షణల సమయంలో భారత వైమానిక దళ విమానాలు కచ్చితమైన దాడుల కోసం రష్యాతో కలిసి భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఇజ్రాయెల్ తయారీ ఎయిర్-టు-గ్రౌండ్ క్రిస్టల్ మేజ్-2, రాంపేజ్ క్షిపణులు, స్పైస్-2000 ప్రెసిషన్ గైడెడ్ బాంబులు, ఫ్రెంచ్ తయారీ స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, హామర్ ఎయిర్-టు-గ్రౌండ్ ప్రెసిషన్ గైడెడ్ మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి. అలాగే, ఇజ్రాయెల్ తయారీ హారోప్, హార్పీ కమికాజే డ్రోన్లను కూడా ఐఏఎఫ్ ప్రయోగించింది. 

ఇదే రీతిలో, ఆర్మీ విభాగాలు స్కైస్ట్రైకర్ వంటి లాంచింగ్ మందుగుండు సామగ్రితో పాటు, ఎక్సాలిబర్ వంటి 'స్మార్ట్' ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఆర్టిలరీ షెల్స్‌ను నిర్దిష్ట లక్ష్యాలపై ప్రయోగించాయి. బహుళస్థాయి గగనతల రక్షణ వ్యవస్థలో భాగంగా, ఇజ్రాయెల్‌తో కలిసి అభివృద్ధి చేసిన బరాక్-8 మధ్యశ్రేణి ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు, స్వదేశీ ఆకాశ్ క్షిపణులతో సహా అనేక రకాల ఆయుధాలను సాయుధ దళాలు వినియోగించాయని సమాచారం.
Rajnath Singh
Indian Army
Emergency Procurement
Defense Budget
BrahMos Missile
Israel Defense
Military Weapons
India Pakistan Tension
Armed Forces

More Telugu News