Mexican Boat: బ్రూక్లిన్ బ్రిడ్జిని ఢీకొన్న మెక్సికన్ నౌక.. వీడియో ఇదిగో!

Mexican Navy sailboat crashes into Brooklyn Bridge
  • ఇద్దరు మృతి.. 19 మందికి గాయాలు
  • న్యూయార్క్‌లో ఘోర ప్రమాదం
  • వంతెనను తాకి విరిగిపోయిన నౌక పైభాగాన ఉన్న స్తంభాలు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత బ్రూక్లిన్ బ్రిడ్జిని మెక్సికో దేశానికి చెందిన నౌకాదళ శిక్షణ నౌక "క్వాటెమోక్" ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారంతా నౌకలోని సిబ్బందేనని పేర్కొన్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ రివర్ మీదుగా బ్రూక్లిన్ బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. నౌకకున్న మూడు పొడవైన స్తంభాలు వంతెన కింది భాగాన్ని బలంగా తాకాయి. దీంతో ఆ స్తంభాలు విరిగిపోయి, పాక్షికంగా కూలిపోయాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని దృశ్యాల్లో, స్తంభాలు విరిగి కూలుతున్నప్పుడు కొందరు వ్యక్తులు వాటిని పట్టుకుని వేలాడుతున్నట్లు కనిపించింది. ఒక వ్యక్తి సుమారు 15 నిమిషాల పాటు స్తంభం పైనుంచి వేలాడుతూ కనిపించాడని, తర్వాత అతడిని రెస్క్యూ టీమ్ రక్షించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
 
న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారని, నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మీడియాకు వెల్లడించారు. ప్రమాదానికి గురైన క్వాటెమోక్ నౌక సుమారు 297 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు ఉంటుందని మెక్సికన్ నౌకాదళం పేర్కొంది. బ్రూక్లిన్ బ్రిడ్జితో జరిగిన ప్రమాదం వల్ల నౌక దెబ్బతిందని, దాని ప్రయాణాన్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. 
 
ఈ శిక్షణ నౌక సాధారణంగా నావల్ మిలిటరీ స్కూల్‌లో తరగతులు ముగిసిన తర్వాత కెడెట్ల శిక్షణను పూర్తి చేయడానికి ఏటా ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 6న మెక్సికోలోని అకాపుల్కో పోర్టు నుంచి 277 మంది సిబ్బందితో బయలుదేరింది. 15 దేశాల్లోని 22 ఓడరేవులను సందర్శించే ప్రణాళికలో భాగంగా న్యూయార్క్ చేరుకుంది. మొత్తం 254 రోజుల ప్రయాణంలో, 170 రోజులు సముద్రంలో గడపాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Mexican Boat
Brooklyn Bridge
Newyork
Viral Videos

More Telugu News