Bilawal Bhutto Zardari: మీరేం చేస్తే మేమూ అదే చేస్తామంటున్న పాక్.. విదేశాలకు ప్రతినిధి బృందాలు

Pakistan Mimics Indias Actions After Pulwama Attack
  • విదేశాలకు శాంతి రాయబారుల బృందాన్ని పంపుతున్న పాక్ ప్రధాని
  • ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలో బృందం ఏర్పాటు
  • మోదీ ఎయిర్ ఫోర్స్ బేస్ ను సందర్శిస్తే సైనిక శిబిరాన్ని విజిట్ చేసిన షరీఫ్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ భారత్ను అనుకరిస్తోంది. మీరేం చేస్తే మేమూ అదే చేస్తామన్నట్లు ప్రవర్తిస్తోంది. ఉగ్రదాడి ఘటన తర్వాత టెర్రరిజంపై భారత పోరాటాన్ని, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ఏడుగురు ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపించనున్నట్లు శనివారం ప్రకటించింది. భారత్ ఇలా ప్రకటన చేసిందో లేదో పాకిస్థాన్ వెంటనే అందుకుంది. శాంతి రాయబారుల పేరుతో తమ ఎంపీల బృందాన్ని విదేశాలకు పంపించనున్నట్లు ప్రకటించింది.

ప్రతిపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీనిపై బిలావల్ భుట్టో ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ గొంతుక వినిపించే అవకాశం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు అప్పగించారని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని తనతో సంప్రదింపులు జరిపారని వివరించారు. ఈ బాధ్యతను స్వీకరించడం తనకు గర్వకారణమని అన్నారు. దేశసేవ కోసం తాను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సియాల్‌కోట్‌లోని తమ సైనిక స్థావరాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.
Bilawal Bhutto Zardari
Shehbaz Sharif
Pakistan
India
International Relations
Terrorism
Parliamentary Delegation
Diplomacy
Indo-Pak Relations

More Telugu News