Vallabhaneni Gopalarao: పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. తప్పించుకునేందుకు కృష్ణానదిలో దూకి వ్యక్తి మృతి

Man Drowns Escaping Police Gambling Raid in Andhra Pradesh
  • ప్రాణభయంతో కృష్ణానది పాయలోకి దూకిన జూదరులు
  • ఈదలేక ఒకరు నీట మునిగి మృతి
  • కృష్ణా జిల్లా రొయ్యూరులో ఘటన
  • మృతుడు మద్దూరు వాసి వల్లభనేని గోపాలరావు 
పేకాట శిబిరంపై పోలీసులు జరిపిన దాడి తీవ్ర విషాదానికి దారితీసింది. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి కృష్ణానది పాయలోని నీటి గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దురదృష్టకర సంఘటన కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరులో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతుడిని కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన వల్లభనేని గోపాలరావు (30)గా గుర్తించారు.

స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యూరు సమీపంలోని లంక భూముల్లో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నారన్న సమాచారం తోట్లవల్లూరు పోలీసులకు అందింది. దీంతో వారిని పట్టుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను గమనించిన జూదరులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో ఒడుగు వెంకటేశ్వరరావు, వల్లభనేని గోపాలరావు కృష్ణానది పాయలో ఉన్న నీటి గుంతలోకి దూకి అవతలి ఒడ్డుకు చేరుకోవడానికి ప్రయత్నించారు.

ఒడుగు వెంకటేశ్వరరావు ఈదుకుంటూ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకోగా, గోపాలరావు ఈదలేక నీటిలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై నదిలోకి దిగి గోపాలరావును బయటకు తీశారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న గోపాలరావు బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vallabhaneni Gopalarao
Krishna River
Todavallu Police
Gambling Raid
Andhra Pradesh
Accidental Death
Roiyuru
Kankipadu
Drowning
Police Chase

More Telugu News