Teacher's Wedding: ఇద్దరు ఉపాధ్యాయుల పెళ్లి.. ‘ఆపండి’ అంటూ మరో ఉపాధ్యాయుడి ఎంట్రీ!

Teachers Wedding Interrupted by Another Teachers Unexpected Entry
  • పాల్వంచలో రెండో పెళ్లికి అంతరాయం
  • ప్రైవేటు టీచర్ వధువు.. ప్రభుత్వ టీచర్ వరుడు
  • మరో ప్రభుత్వ టీచర్ వచ్చి వధువును ఇష్టపడుతున్నానంటూ గందరగోళం
  • ఆగిన పెళ్లి.. పోలీసులకు వధువు ఫిర్యాదు 
జీవితంలో రెండో అధ్యాయాన్ని ప్రారంభించాలనుకున్న ఓ జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. పీటల మీద పెళ్లి జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తి వచ్చి ‘ఈ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను, ఈ పెళ్లి ఆపండి’ అంటూ గందరగోళం సృష్టించడంతో వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శనివారం సాయంత్రం జరిగిందీ ఘటన.

వివరాల్లోకి వెళితే.. పాల్వంచకు చెందిన 29 ఏళ్ల మహిళ స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆమెకు వివాహం కాగా, ఓ పాప కూడా ఉంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. మరోవైపు, ఖమ్మంలో పనిచేస్తున్న 33 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడికి కూడా ఇది రెండో వివాహం. కొన్నేళ్ల క్రితం ఆయన భార్య మరణించారు. ఇరు కుటుంబాల పెద్దలు వీరిద్దరికీ వివాహం జరిపించాలని నిశ్చయించారు. శనివారం సాయంత్రం పాల్వంచలోని ఓ ప్రార్థనా మందిరంలో పెళ్లి వేడుకకు అన్ని ఏర్పాట్లు చేశారు.

అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో గుండాలకు చెందిన మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెళ్లి వేదిక వద్దకు దూసుకొచ్చాడు. ‘ఈ అమ్మాయి నాకు తెలుసు. ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తున్నప్పటి నుంచి మేమిద్దరం ఇష్టపడుతున్నాం. నాకు పెళ్లయినా పిల్లలు లేరు. నా భార్యకు విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటాను’ అంటూ పెద్దగా కేకలు వేస్తూ రభస సృష్టించాడు.

ఈ హఠాత్ పరిణామంతో వధువు, వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. వధువు తరఫు వారు మాట్లాడుతూ.. ‘గతంలో ఆయన మా అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాడు. కానీ, మా అమ్మాయి తల్లిదండ్రులు చూసిన సంబంధమే చేసుకుంటానని స్పష్టం చేసింది. దానిని మనసులో పెట్టుకుని ఇప్పుడు పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. గతంలో వరుడికి కూడా ఫోన్ చేసి, వధువుతో వివాహేతర సంబంధం ఉందని తప్పుగా చెప్పాడు. ఇప్పుడు ఏకంగా పెళ్లి మండపానికే వచ్చి గొడవ చేశాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా, అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ గందరగోళం కారణంగా వరుడు, అతని బంధువులు తీవ్ర అసంతృప్తికి గురై పెళ్లి రద్దు చేసుకుని వెళ్లిపోయారు. తనకు ఇష్టం లేదని చెప్పినందుకే గుండాలకు చెందిన ఉపాధ్యాయుడు కక్ష పెంచుకుని తన పెళ్లిని చెడగొట్టాడని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Teacher's Wedding
Marriage Interrupted
Palvancha
Bhadradri Kothagudem
Love Triangle
Government Teacher
Private School Teacher
Unexpected Twist
Wedding Drama
Second Marriage

More Telugu News