Potharaju Veerayya: ధాన్యం బస్తాలో రూ. లక్షన్నర దాచిన భర్త ... తెలియక అమ్మేసిన భార్య!

Farmers 15 Lakh Rupees Missing After Wife Sells Rice Sack
  • ఎడ్లమ్మిన డబ్బులు వడ్ల బస్తాలో దాచిన రైతు
  • విషయం తెలియక ఆ బస్తాను అమ్మేసిన ఇల్లాలు
  • డబ్బులు పోవడంతో రైతు ఆందోళన
  • ధాన్యం కొన్న వ్యాపారి ఆచూకీ కోసం గాలింపు
  • భూపాలపల్లి జిల్లా గణపురంలో ఘటన
 జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ రైతు కుటుంబంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎద్దులను అమ్మగా వచ్చిన డబ్బును భర్త ధాన్యం బస్తాలో దాచుకోగా, ఆ విషయం తెలియని భార్య ఆ బస్తాను ఓ వ్యాపారికి విక్రయించింది. తీరా విషయం తెలిశాక లబోదిబోమన్నా ప్రయోజనం లేకపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య కొన్ని రోజుల క్రితం తన ఎద్దులను అమ్మాడు. వచ్చిన లక్షన్నర రూపాయల నగదును ఇంట్లోని ఓ ధాన్యం బస్తాలో భద్రపరిచాడు. అయితే, ఈ విషయం భార్యకు చెప్పలేదు.

గత బుధవారం విడి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వీరయ్య భార్య.. భర్త డబ్బులు దాచిన ఆ ధాన్యం బస్తాను ఇతర ధాన్యంతో పాటు ఆ వ్యాపారికి అమ్మేసింది. పనులన్నీ ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చిన వీరయ్యకు ధాన్యం బస్తా కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది.

వెంటనే భార్యను ఆరా తీయగా ధాన్యం బస్తాను వ్యాపారికి అమ్మినట్టు ఆమె తెలిపింది. దీంతో వీరయ్య హతాశుడయ్యాడు. వెంటనే ఆ వ్యాపారి కోసం గ్రామంలో గాలించినప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ దంపతులు శనివారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గణపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. వ్యాపారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Potharaju Veerayya
Jayashankar Bhupalapally
Farmer
Missing Money
Wife Sold Rice Sack
1.5 Lakh Rupees
Ganapuram Police
Telangana
India
Unexpected Incident

More Telugu News