US Embassy India: అమెరికాలో వీసా గడువు దాటితే కఠిన చర్యలు: భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిక

US Visa Overstay Strict Action Warning from US Embassy in India
  • అమెరికాలో వీసా గడువు దాటొద్దని యూఎస్ ఎంబసీ హెచ్చరిక
  • నిబంధనలు మీరితే దేశం నుంచి బహిష్కరణ, శాశ్వత ప్రయాణ నిషేధం
  • భవిష్యత్ లో విద్యా ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం
  • ఏవైనా ఇబ్బందులుంటే యూఎస్‌సీఐఎస్‌ను సంప్రదించాలని అధికారుల సూచన
అమెరికాలో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న భారతీయుల కోసం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. అనుమతించిన సమయం కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాయబార కార్యాలయం తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో వివరాలను పోస్ట్ చేసింది.

పర్యాటక వీసా, విద్యార్థి వీసా, పని వీసాల వంటి వివిధ రకాల వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని దేశం నుంచి బలవంతంగా పంపించివేయడమే కాకుండా, భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉందని రాయబార కార్యాలయం తెలిపింది.

ఇలాంటి నిషేధం పడితే, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పొందాలన్నా తీవ్రమైన అడ్డంకులు ఎదురవుతాయని పేర్కొంది. అనుకోని పరిస్థితుల వల్ల వీసా గడువు ముగిశాక కూడా దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి వస్తే, చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవడానికి వెంటనే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) అధికారులను సంప్రదించాలని సూచించింది.

గతంలోనూ హెచ్చరికలు

గతంలో కూడా, అమెరికాలో అనుమతించిన గడువుకు మించి ఉంటున్నవారు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అక్కడి హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. "అమెరికాలో 30 రోజులకు మించి నిబంధనలకు విరుద్ధంగా నివసిస్తున్న వారు కచ్చితంగా ఫెడరల్ ప్రభుత్వం వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ నిబంధనను పాటించకపోతే, దానిని నేరంగా పరిగణించి అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అందుకే, వెంటనే స్వదేశాలకు వెళ్లిపోవడం మంచిది" అని గతంలో ఆ విభాగం స్పష్టం చేసింది.

ఈ నిబంధనలను పాటించని వారిని తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. అంతేకాకుండా, తుది ఉత్తర్వులు అందుకున్న తర్వాత కూడా ఒక్క రోజు అధికంగా ఉన్నా, రోజుకు 998 డాలర్ల చొప్పున జరిమానా విధించనున్నారు. సొంతంగా దేశం విడిచి వెళ్లకపోతే 1,000 నుంచి 5,000 డాలర్ల వరకు జరిమానా విధించనున్నారు. అవసరమైతే జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని, అలాంటి వారికి భవిష్యత్తులో చట్టబద్ధమైన మార్గాల్లో కూడా అమెరికాలోకి ప్రవేశం లభించదని అధికారులు హెచ్చరించారు.
US Embassy India
US Visa Overstay
India US Visa
American Visa
Visa Expiry
US Immigration

More Telugu News