Gujarat Court Ruling: వివాహేతర సంబంధం ఉందని భార్యకు విడాకులు ఇచ్చినా సరే భరణం ఇవ్వాల్సిందే!.. గుజరాత్ కోర్టు తీర్పు

Gujarat Court Orders Alimony Despite Extramarital Affair Claim
––
భార్యకు వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలతో విడాకులు కోరుతూ భర్త కోర్టుకెక్కాడు.. భర్త కోరినట్లు విడాకులు మంజూరు చేసిన కోర్టు.. భార్యకు భరణం చెల్లించాలని తీర్పు చెప్పింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ న్యాయస్థానం ఈ షాకింగ్ తీర్పు వెలువరించింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అదే సమయంలో ఆమెకు గృహ హింస చట్టం కింద రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని.. వాటితోపాటు నెలకు రూ.40 వేలు భరణం, రూ.20 వేలు ఇంటి అద్దె కింద చెల్లించాలని ఆదేశించింది.

అహ్మదాబాద్ లోని సబర్మతి ప్రాంతానికి చెందిన వ్యక్తి, గాంధీనగర్ కు చెందిన మహిళను 2006లో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వారు అబుదాబిలో కాపురం పెట్టారు. 2012లో వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ క్రమంలోనే భర్త తనను వేధించాడని, గొడవల కారణంగా భర్తతో ఉండలేక 2016లో తాను ఇండియాకు తిరిగివచ్చానని భార్య కోర్టుకు తెలిపింది. 2017లో సబర్మతి పోలీస్ స్టేషన్‌లో ఆమె తన భర్తపై ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. గృహ హింస, మహిళల రక్షణ చట్టం కింద ఫిర్యాదు చేసింది.

దీంతో భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. భార్య అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో భరణం కావాలని భార్య పిటిషన్ దాఖలు చేసింది. 2023 జనవరి 20వ తేదీన వ్యభిచారం, క్రూరత్వం ప్రాతిపదికన కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఆమెకు, వారి కుమారుడికి కలిపి నెలకు రూ. 40 వేలు భరణం, ఇంటి అద్దె కింద మరో రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిహారం కింద రూ.25 లక్షలు కూడా చెల్లించాలని భర్తను ఆదేశించింది. విచారణ తర్వాత ఆ మహిళ గృహ హింసకు గురైందని గుర్తించింది.

అయితే తాను ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నానని.. భరణం చెల్లించుకోలేనని ఆమె భర్త వాదించాడు. కానీ ఆ వాదనను కోర్టు నమ్మలేదు. యూఏఈలో రెండో భార్యతో జీవిస్తున్న వ్యక్తి భరణం తప్పించుకునేందుకే తాను నిరుద్యోగి అని వాదించాడని తేల్చింది. దీంతో భార్యకు భరణం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.
Gujarat Court Ruling
Divorce
Alimony
Domestic Violence
Extramarital Affair
Wife's Alimony
Husband's Appeal
Ahmedabad Court
Family Court
India

More Telugu News