Chandrababu Naidu: ఈసారి మనపై దాడి చేస్తే పాకిస్థాన్ కు అదే చివరి రోజు అవుతుంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Warns Pakistan Attack Will Be Their Last Day
  • ఆపరేషన్ సిందూర్ విజయవంతం
  • విజయవాడలో తిరంగా ర్యాలీ
  • హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్
మహిళల నుదుట సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ తో ధీటుగా బదులిచ్చామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. భారత్ పై తమ ఆటలు సాగవని పాకిస్థాన్ గ్రహించాలని,  మన దేశంపై దాడి చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందన్నారు. ఉగ్రవాదంపై అలుపెరుగుని పోరాటం చేస్తున్న  సైనికులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. మోదీ రూపంలో దేశానికి సమర్థవంతమైన నాయకుడు లభించాడని, ఉగ్రవాదం అంతు చూడాలని ప్రధాని సంకల్పించారని అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా విజయవాడలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సీఎం చంద్రబాబు , జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...

సైనిక దళాలకు సెల్యూట్ 

పహల్గామ్ ఘటన గుర్తుకురాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనిక దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం సాయుధ బలగాలే. రక్షణ దళాలు... ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా పోరాడాయి. మన సైనికులను చూసి ఏపీనే కాదు... దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు.  జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం. 

ఉగ్రవాదంపై ప్రధాని మోదీ రాజీలేని పోరాటం

మన దేశానికి సరైన సమయంలో దొరికిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. మనం ఎప్పుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పితీరుతాం. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కున్నా తుదముట్టించేందుకు ప్రధాని సంకల్పం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో శత్రు దేశాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తీవ్రవాద రూపంలో మనదేశానికి వస్తే అదే వారికి చివరిరోజవుతుంది.  మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగానూ ఎదుగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, అసూయ పడేవారెవరూ మన దేశాన్ని ఏం చేయలేరు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది.  దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ స్పూర్తితో ముందుకు వెళదాం అని సీఎం చంద్రబాబు అన్నారు. 
Chandrababu Naidu
Pakistan
Operation Sindhoor
Terrorism
India
National Security
Narendra Modi
Pawan Kalyan
AP Politics
Surgical Strike

More Telugu News