Ishaq Dar: ఫేక్ వార్తను నిజమని నమ్మి అభాసుపాలైన పాక్ ఉప ప్రధాని

Pakistani Deputy PM Ishaq Dars Embarrassment over Fake News
  • పాక్ పార్లమెంటులో నకిలీ వార్త చదివిన ఉప ప్రధాని ఇషాక్ దార్
  • 'పాక్ ఎయిర్‌ఫోర్స్ ఆకాశంలో రారాజు' అంటూ డైలీ టెలిగ్రాఫ్ కీర్తించిందని వ్యాఖ్య
  • ఇది కృత్రిమ మేధ సృష్టించిన తప్పుడు కథనమని 'డాన్ 'వెల్లడి
  • ఇషాక్ దార్‌పై వెల్లువెత్తిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు
ఇటీవల పాకిస్థాన్ పార్లమెంటు (సెనేట్) సమావేశంలో ఇషాక్ దార్ ప్రసంగిస్తూ, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక 'ది డైలీ టెలిగ్రాఫ్' పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ (పీఏఎఫ్) పనితీరును ఆకాశానికెత్తేసిందని పేర్కొన్నారు. 'గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్' (Undisputed King of the Skies) అంటూ ఆ పత్రిక హెడ్‌లైన్ పెట్టిందని ఆయన సభకు తెలిపారు. ముఖ్యంగా, భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు అంతర్జాతీయ మీడియాలో ప్రశంసలు వస్తున్న తరుణంలో, అందుకు భిన్నంగా 'డైలీ టెలిగ్రాఫ్' పాక్ వైమానిక దళాన్ని కీర్తించిందని దార్ చెప్పే ప్రయత్నం చేశారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై అనుమానం రావడంతో పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'డాన్' న్యూస్ దీనిపై నిజ నిర్ధారణ చేపట్టింది. 'డాన్' పరిశోధనలో ఇషాక్ దార్ చెప్పిన విషయాలు పూర్తిగా అబద్ధాలని తేలింది. మే 10వ తేదీన ప్రచురితమైందని దార్ పేర్కొన్న 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక మొదటి పేజీలో అలాంటి వార్త ఏదీ లేదని 'డాన్' స్పష్టం చేసింది. అసలు ఆ పత్రిక పాకిస్థాన్ సైన్యానికి సంబంధించి ఆ తరహా కథనాన్ని ఎప్పుడూ ప్రచురించలేదని తేల్చి చెప్పింది.

మరోవైపు, 'ది డైలీ టెలిగ్రాఫ్' పత్రిక కూడా ఈ విషయంపై స్పందించింది. తాము 'గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్' అనే శీర్షికతో ఎలాంటి కథనాన్ని ప్రచురించలేదని ఖరాఖండిగా చెప్పింది. పాకిస్థానీయులే ఎవరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఈ తప్పుడు వార్తను, హెడ్‌లైన్‌ను సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయగా, దానిని నిజమని నమ్మి ఇషాక్ దార్ పార్లమెంటులో ప్రస్తావించి అభాసుపాలయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై సొంత దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలాంటి నకిలీ వార్తలను పార్లమెంటులో చదవడంపై ఎద్దేవా చేస్తున్నారు.
Ishaq Dar
Pakistan
Pakistan Air Force
Daily Telegraph
Fake News
Social Media
Misinformation
International Criticism
Artificial Intelligence
Operation Sindhu

More Telugu News