Operation Sindhur: ‘ఆపరేషన్ సిందూర్’ ఘన విజయం.. భారత రక్షణ బడ్జెట్‌కు అదనపు జవసత్వాలు!

Operation Sindhurs Success Boosts Indias Defense Budget
  • రక్షణ బడ్జెట్‌కు అదనంగా రూ.50,000 కోట్లు?
  •  కొత్త ఆయుధాలు, సాంకేతికత కొనుగోలుకు ప్రాధాన్యం
  •  వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిల్లు
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైన నేపథ్యంలో భారత రక్షణ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సరిహద్దులు దాటకుండానే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బడ్జెట్ పెంపు ప్రతిపాదన
నూతన ఆయుధాలు, మందుగుండు సామగ్రి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సేకరణ కోసం రక్షణ రంగానికి అదనంగా రూ. 50,000 కోట్లు కేటాయించే ప్రతిపాదన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అదనపు కేటాయింపులకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి, ఆమోదం పొందే అవకాశాలున్నాయని సమాచారం. ఈ అదనపు నిధులతో సాయుధ బలగాల అవసరాలు తీర్చడం, కీలకమైన కొనుగోళ్లు చేపట్టడం, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు.

గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 6.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత కేటాయింపులు మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

 ‘మేడిన్ ఇండియా’పై ప్రధాని ప్రశంసలు
‘ఆపరేషన్ సిందూర్’ దేశీయంగా తయారైన ఆయుధాల సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 12న తన ప్రసంగంలో ప్రశంసించారు. "ఈ ఆపరేషన్ సమయంలో, మన 'మేడిన్ ఇండియా' ఆయుధాల విశ్వసనీయత దృఢంగా స్థిరపడింది. 21వ శతాబ్దపు యుద్ధ తంత్రంలో 'మేడిన్ ఇండియా' రక్షణ పరికరాల సమయం ఆసన్నమైందని ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ విజయం దేశీయ రక్షణ ఉత్పత్తుల తయారీకి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Operation Sindhur
Indian Defense Budget
Narendra Modi
Make in India
Defense Modernization
Pakistan
Terrorist Camps
Military Operation
India-Pakistan Relations
National Security

More Telugu News