AP Government: ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... మార్గదర్శకాలు ఇవే!

AP Govt Green Signals Employee Transfers New Guidelines Released
  • ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం ఎత్తివేత
  • మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలకు ఆర్థిక శాఖ ఆమోదం
  • ఒకేచోట ఐదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ
  • వివిధ కేటగిరీల వారికి ప్రాధాన్యత, కొన్ని మినహాయింపులు
  • విభాగాల వారీగా బదిలీ అర్హతలపై స్పష్టమైన మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలను చేపట్టేందుకు ఆర్థిక శాఖ అనుమతినిచ్చింది. ఇందుకు అనుగుణంగా, ఆయా ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు సంబంధించిన అర్హతలు, ప్రాధాన్యతలపై విధివిధానాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం... ఒకే స్థానంలో ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను కచ్చితంగా బదిలీ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. అదేవిధంగా, పదోన్నతి పొందిన తర్వాత కూడా ఒకే ప్రాంతంలో ఐదేళ్లుగా కొనసాగుతున్న వారికి సైతం ఈ బదిలీలు వర్తించనున్నాయి. అయితే, ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థనల మేరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది (2026) మే 31వ తేదీలోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు ఈ సాధారణ బదిలీల నుంచి మినహాయింపు లభిస్తుంది. దృష్టి లోపం కలిగిన (అంధులైన) ఉద్యోగులు కోరుకుంటే, వారి బదిలీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మానసిక వికాస సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులైన ఉద్యోగులకు, వారి విజ్ఞప్తి మేరకు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.

అంతేకాకుండా, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు, వారు కోరిన పక్షంలో బదిలీల్లో ప్రాధాన్యత దక్కుతుంది. వైద్యపరమైన కారణాలతో బదిలీ కోరే ఉద్యోగుల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వితంతువులైన ఉద్యోగినులు వారి వినతి మేరకు బదిలీల్లో ప్రాధాన్యం పొందుతారు. భార్యాభర్తలైన ఉద్యోగులు (స్పౌజ్ కేసులు) ఒకేచోట లేదా సమీప ప్రాంతాల్లో పనిచేసేలా వారి బదిలీలకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
AP Government
Andhra Pradesh
Employee Transfers
Government Employees
Transfer Policy
AP Transfer Guidelines
Employee Transfer Guidelines
Spouse Transfers
Disability
Tribal Areas

More Telugu News