Revanth Reddy: కాళేశ్వరానికి ముఖ్యమంత్రి రేవంత్ భారీ కానుక!

CM Revanth Reddys Grand Gift to Kaleshwaram Temple
  • కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం
  • ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రణాళిక
  • అభివృద్ధికి రూ.200 కోట్ల వరకు కేటాయింపునకు సుముఖత
కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ పుష్కరాల్లో భాగంగా నిర్వహించిన హారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సరస్వతీ పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం మొట్టమొదటిసారిగా టెంట్ సిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

త్వరలోనే గోదావరి, కృష్ణా పుష్కరాలు రానున్నాయని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాలు కూడా ఘనంగా నిర్వహించే అదృష్టం తనకు కలగనుందని అన్నారు. కాళేశ్వరం క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడింపజేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
Revanth Reddy
Kaleshwaram Temple
Kaleshwaram Development
Telangana Tourism
Spiritual Tourism

More Telugu News