Shikha Goel: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, గూగుల్ క్లౌడ్ మధ్య కీలక ఒప్పందం

Telangana Cyber Security Bureau Partners with Google Cloud
  • రాష్ట్రంలో సైబర్ భద్రత పటిష్టతే లక్ష్యం
  • సైబర్ దాడులు, ముప్పుల ముందస్తు గుర్తింపు
  • పోలీసు ఐటీ మౌలిక వసతుల నిరంతర పర్యవేక్షణ
  • మూడేళ్ల కాలవ్యవధితో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడి
తెలంగాణ రాష్ట్రం సైబర్ భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒక కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ క్లౌడ్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు, డిజిటల్ రక్షణ కవచాన్ని బలోపేతం చేయనున్నారు.

రాష్ట్రంలో పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, సైబర్ దాడుల నేపథ్యంలో వాటిని ముందస్తుగా గుర్తించి, నిరోధించడానికి గూగుల్ క్లౌడ్ అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపకరించనుంది. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ పోలీసు శాఖ సైబర్ రక్షణ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.

గూగుల్ క్లౌడ్ సహకారంతో సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను 24 గంటలూ పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది. అంతేకాకుండా, పోలీసు శాఖకు సంబంధించిన ఐటీ మౌలిక సదుపాయాలను నిరంతరం కనిపెట్టుకుని ఉండటం ద్వారా ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలనైనా తక్షణమే గుర్తించి, తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది సైబర్ బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహదపడుతుంది. ఈ అవగాహన ఒప్పందం మూడేళ్ల కాలవ్యవధి కలిగి ఉంటుందని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు.
Shikha Goel
Telangana Cyber Security Bureau
Google Cloud
Cyber Security
Cybercrime
Digital Security

More Telugu News