Ramdas Athawale: పీఓకేను అప్పగించకుంటే మరిన్ని యుద్ధాలు తప్పవు: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే

More Wars Inevitable If POK Not Handed Over Minister Athawale
  • పీవోకేను భారత్‌లో విలీనం చేయాలని కేంద్రమంత్రి రాందాస్ డిమాండ్
  • ఆపరేషన్ సిందూర్‌తో భారత సైన్యం పాక్‌కు గుణపాఠం చెప్పిందని ప్రశంస
  • వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని వెల్లడి
  • కాశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అనవసరమని స్పష్టీకరణ
పీఓకే అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకేను భారత్‌లో విలీనం చేయాల్సిందేనని, ఒకవేళ పాకిస్థాన్ అందుకు అంగీకరించని పక్షంలో దానిని స్వాధీనం చేసుకునేందుకు మరిన్ని యుద్ధాలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ ను ప్రశంసించిన అథవాలే, ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం పాకిస్థాన్ ఆర్మీకి తగిన రీతిలో బుద్ధి చెప్పిందని అన్నారు.

"పాకిస్థాన్‌ ను భారత్ గట్టిగా దెబ్బతీసింది. కాల్పుల విరమణ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మన సైన్యం దాయాది దేశానికి సరైన గుణపాఠం నేర్పింది. పాకిస్థాన్‌లో తలదాచుకున్న వంద మంది ఉగ్రవాదులను హతమార్చాం. ఈ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ముగించలేదు. పీవోకేను భారత్‌కు అప్పగించాలని, ఉగ్రవాద కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని పాకిస్థాన్ ముందు భారత్ స్పష్టమైన ప్రతిపాదనలు ఉంచింది" అని వివరించారు.

కశ్మీర్ వివాదంలో మూడో వ్యక్తి ప్రమేయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని అథవాలే తేల్చిచెప్పారు. "తూటాకు తూటాతోనే సమాధానం చెప్పడమనేది భారత విధానం. పీవోకే భారత్‌లో అంతర్భాగమని గతంలో పార్లమెంటు వేదికగా కూడా నేను స్పష్టం చేశాను. ఒకవేళ పాకిస్థాన్ దానిని అప్పగించకపోతే, దాన్ని తిరిగి మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మరిన్ని యుద్ధాలు చేయాల్సి ఉంటుంది" అని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుత సున్నితమైన పరిస్థితులను విపక్షాలు రాజకీయం చేయవద్దని కూడా అథవాలే హితవు పలికారు.
Ramdas Athawale
POK
India-Pakistan
Operation Sindhu
Kashmir conflict
War
Pakistan
Terrorism

More Telugu News