Narendra Modi: జూన్ 21న విశాఖకు ప్రధాని మోదీ .. ఎందుకంటే..?

PM Modi to Attend International Yoga Day in Visakhapatnam
  • జూన్ 21న విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
  • సుమారు 2లక్షల మందితో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
  • ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎస్ విజయానంద్
విశాఖపట్నంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై బుధవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా సమీక్ష నిర్వహించారు.

మే 2న ప్రధాని అమరావతికి వచ్చినపుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని, ఆ వేడుకలకు తాను హాజరవుతానని సభా వేదిక నుండి ప్రకటించారు. అందుకు అనుగుణంగా జూన్ 21న విశాఖలో "Yoga for One Earth, One Health" అనే నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయనుంది.

ఈ ఏడాది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాముఖ్యతపై అవగాహన తెచ్చేందుకు ఇప్పటికే మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా గత మార్చి 13 నుండి జూన్ 21 వరకు 100 రోజుల్లో 100 నగరాల్లో 100 ఆర్గనైజేషన్ల పేరిట గ్లోబల్ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం "యోగాంధ్ర-2025" నినాదంతో ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది.

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్, వివిధ విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల భాగస్వామ్యంతో సుమారు 2 లక్షల మందితో రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ మాట్లాడుతూ విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని అన్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబును ప్రభుత్వం నోడల్ అధికారిగా నియమించిందని తెలిపారు. కావున ఇప్పటి నుండే ఏర్పాట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

విశాఖపట్నం నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 8వ తరగతి నుండి డిగ్రీ, పిజి చదివే విద్యార్థులు అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ మిషన్ ప్రతినిధులు, యోగా శిక్షకులు, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్లు, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్లు, పిఇటిలు, స్పోర్ట్స్ కోచ్‌లు, విశాఖలోని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సిఎస్ విజయానంద్ సూచించారు.

ఈ సమావేశానికి ఢిల్లీ నుండి వర్చువల్‌గా పాల్గొన్న కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ఖరారు చేస్తామని, రెండు లక్షల టి షర్టులు, యోగా మ్యాట్లను రాష్ట్రానికి పంపనున్నట్టు చెప్పారు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో నోడల్ అధికారి యంటి కృష్ణబాబు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేడుకల్లో సుమారు రెండు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ త్వరలో ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ఖరారు చేయనుందని చెప్పారు. విశాఖలో ఈ ఈవెంట్‌ను ఎక్కడ నిర్వహించాలనేది ఖరారు చేయాల్సి ఉందన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండ్యన్, ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. అలాగే పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, విద్య శాఖ కార్యదర్శి కె శశిధర్, సిఆర్డిఏ కమీషనర్ కె కన్నబాబు, ఐటి శాఖ కార్యదర్శి కె. భాస్కర్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. 
Narendra Modi
International Yoga Day
Visakhapatnam
Yoga for One Earth One Health
Yoga Andhra 2025
K Vijayananad
M T Krishnababu
Ayush Ministry
Art of Living
Isha Foundation

More Telugu News