Mir Yar Baloch: బలూచిస్థాన్ ఇక పాకిస్థాన్ కాదు.. మమ్మల్ని పాకిస్థానీయులుగా సంబోధించవద్దు: బలూచ్ ప్రతినిధి

Baluchistan Declares Independence from Pakistan
  • పాకిస్థాన్ నుంచి మా ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటున్నామని ప్రకటన
  • బలూచ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారని వెల్లడి
  • తమను పాకిస్థాన్ ప్రజలుగా సంబోధించవద్దన్న మీర్ యార్ బలోచ్
బలూచిస్థాన్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు, బలవంతపు అదృశ్యాల నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం ప్రకటిస్తున్నామని బలూచ్ ప్రతినిధి మీర్ యార్ బలోచ్ బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా తమ ప్రజల 'జాతీయ తీర్పు'ను వెలువరించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఇకపై మౌనంగా ఉండరాదని ఆయన కోరారు.

పాకిస్థాన్ ఆక్రమిత బలూచిస్థాన్‌లోని బలూచ్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని, 'బలూచిస్థాన్ పాకిస్థాన్ కాదు' అన్నదే తమ జాతీయ తీర్పు అని మీర్ యార్ బలోచ్ తన పోస్టులో పేర్కొన్నారు. "మీరు చంపుతారు, మేము బయటకు వస్తాం. మేము మా జాతిని కాపాడుకోవడానికి బయలుదేరాం. మాతో చేతులు కలపండి" అంటూ ఆయన ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.

బ్రిటీషర్లు భారత ఉపఖండం నుంచి వెళ్లిపోతున్న సమయంలో, 1947 ఆగస్ట్ 11నే తాము స్వాతంత్ర్యం ప్రకటించుకున్నామని మీర్ యార్ బలోచ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ సైన్యం బలూచ్ భూభాగాన్ని విడిచిపెట్టినప్పుడే బలూచిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రకటిస్తారా? అన్న ఓ ప్రముఖ పాత్రికేయుడి ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు.

పాకిస్థాన్ ప్రజలుగా సంబోధించవద్దు

భారతీయ పౌరులు, ముఖ్యంగా మీడియా, యూట్యూబర్‌లు, మేధావులు బలూచ్‌లను "పాకిస్థాన్ సొంత ప్రజలు"గా సంబోధించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. "ప్రియమైన భారతీయ దేశభక్తి మీడియా, యూట్యూబ్ మిత్రులు, భారత్‌ను రక్షించడానికి పోరాడుతున్న మేధావులు బలూచ్‌లను 'పాకిస్థాన్ సొంత ప్రజలు'గా పేర్కొనవద్దని కోరుతున్నాం. మేము పాకిస్థానీయులం కాదు, మేము బలూచిస్థానీయులం. వైమానిక దాడులు, బలవంతపు అదృశ్యాలు, మారణహోమాన్ని ఎన్నడూ ఎదుర్కోని పంజాబీలే పాకిస్థాన్ సొంత ప్రజలు" అని ఆయన వ్యాఖ్యానించారు.

పీవోజేకే విషయంలో భారత్‌కు మద్దతు

పీఓజేకే విషయంలో భారత వైఖరికి బలూచిస్థాన్ పూర్తి మద్దతు ఇస్తుందని మీర్ యార్ బలోచ్ ప్రకటించారు. పీఓజేకేను తక్షణమే ఖాళీ చేయాలని పాకిస్థాన్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. "ఢాకాలో 93,000 మంది సైనికుల లొంగుబాటు వంటి మరో అవమానాన్ని నివారించడానికి పాకిస్థాన్ వెంటనే పీఓజేకేను విడిచిపెట్టాలని అంతర్జాతీయ సమాజం కోరాలి. పాకిస్థాన్ సైన్యాన్ని ఓడించే సత్తా భారత్‌కు ఉంది.

పాకిస్థాన్ పట్టించుకోకపోతే, ఇస్లామాబాద్ పీఓజేకే ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటున్నందున, ఆ రక్తపాతానికి పాకిస్థానీ దురాశపరులైన సైనిక జనరల్స్ మాత్రమే బాధ్యత వహించాలి" అని ఆయన హెచ్చరించారు. బలూచిస్థాన్ స్వాతంత్ర్యానికి భారత్, ప్రపంచ దేశాల నుంచి గుర్తింపు, మద్దతు కావాలని మీర్ యార్ బలోచ్ కోరారు. విదేశీ శక్తుల ప్రమేయంతో బలవంతంగా విలీనం చేయబడిన బలూచిస్థాన్ విషయంలో పాకిస్థాన్ వాదనను ప్రపంచం అంగీకరించవద్దని కోరారు.
Mir Yar Baloch
Baluchistan
Pakistan
Baluch Independence
Human Rights Violations
Forced Disappearances
POJK

More Telugu News