Miss World 2025: బతుకమ్మ ఆడి.. చీరకట్టులో ఓరుగల్లులో ప్రపంచ సుందరీమణుల సందడి!

Miss World 2025 Contestants Celebrate Bathukamma in Warangal
  • హన్మకొండ హరిత కాకతీయలో బతుకమ్మ ఆడి సందడి
  • ఓరుగల్లు వైభవం చూసి మురిసిన విదేశీ వనితలు
  • వేయిస్థంబాల గుడిలో వేదాశీర్వచనం అందుకున్న సుందరీమణులు
  • మిస్ వరల్డ్ బృందం చారిత్రక వరంగల్ పర్యటన
ప్రపంచ సుందరి-2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు భారతీయ సంస్కృతి, వారసత్వాలను ఆస్వాదించే పర్యటనలో భాగంగా బుధవారం చారిత్రక నగరమైన ఓరుగల్లులో అడుగుపెట్టారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వరంగల్‌కు చేరుకున్న ఈ అందాల బృందానికి హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక మహిళలు సంప్రదాయ పద్ధతిలో మేళతాళాలు, బతుకమ్మలతో వారిని ఆహ్వానించారు. అనంతరం, హరిత కాకతీయ ప్రాంగణంలో స్థానిక మహిళలతో కలిసి ఈ సుందరీమణులు బతుకమ్మ ఆడారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఆ తర్వాత, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ఈ బృందం బయలుదేరింది. ఆలయ ప్రాంగణంలో భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ కొందరు అందాలభామలు చీరకట్టులో మెరిసిపోయారు. వారంతా కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆలయ విశిష్టత, కాకతీయ శిల్పకళా నైపుణ్యం గురించి టూరిజం గైడ్లు వారికి సవివరంగా తెలియజేశారు. రామప్ప నిర్మాణ శైలి, శిల్పాలలోని జీవకళ వారిని అబ్బురపరిచాయి. సుందరీమణులు రెండు బృందాలుగా విడిపోయి వరంగల్ నగరంలోని ఇతర చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించారు. వరంగల్ వేయి స్థంబాల గుడిని దర్శించుకున్న ప్రపంచ సుందరీమణులకు వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

ఈ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఒక అదనపు డీసీపీ, 11 మంది ఏసీపీలు, 32 మంది ఇన్‌స్పెక్టర్లు, 81 మంది ఎస్సైలు, 115 మంది కానిస్టేబుళ్లతో పాటు 325 మంది మహిళా పోలీసులు, 106 మంది హోంగార్డులు, 210 మంది ప్రత్యేక పోలీసులు (డిస్ట్రిక్ట్ గార్డ్స్) బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా భద్రతా పర్యవేక్షణలో నిమగ్నమయ్యాయి. మొత్తంగా వెయ్యి మందికి పైగా పోలీసు సిబ్బందితో ఈ పర్యటనకు భద్రత కల్పించారు.
Miss World 2025
Warangal
Orugallu
Ramapp Temple
UNESCO World Heritage Site
Bathukamma
Telangana Culture

More Telugu News