India: భారత రక్షణ రంగ ఎగుమతుల్లో రికార్డు స్థాయి పెరుగుదల

Indias Defense Exports Reach Record High
  • మేక్ ఇన్ ఇండియా' సత్తా... రక్షణ ఎగుమతుల్లో కొత్త శిఖరాలు
  • భారత్ రక్షణ ఎగుమతుల్లో 34 రెట్ల వృద్ధి
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.23,622 కోట్ల ఎగుమతులు
  • 2013-14లో కేవలం రూ.686 కోట్లుగా ఉన్న ఎగుమతులు
భారత రక్షణ రంగం 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో అద్భుత ప్రగతి సాధిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు రూ.23,622 కోట్లకు (సుమారు $2.76 బిలియన్లు) చేరి చారిత్రక రికార్డు సృష్టించాయి. ఇది దేశ రక్షణ చరిత్రలోనే అత్యధికం కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.21,083 కోట్లుగా ఉన్న ఎగుమతులు, ఈ ఏడాది 12.04% వృద్ధిని నమోదు చేశాయి. 2013-14లో కేవలం రూ.686 కోట్లుగా ఉన్న ఎగుమతులు ఇప్పుడు ఏకంగా 34 రెట్లు పెరగడం 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమ పటిష్టతకు నిదర్శనమని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం భారత్ సుమారు 80 దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా... 2029 నాటికి ఈ ఎగుమతులను రూ.50,000 కోట్లకు చేర్చాలని రక్షణ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సిందూర్‌' భారత ఆయుధ వ్యవస్థల నాణ్యతను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

కాగా, రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రైవేటు సంస్థల వాటా రూ.15,233 కోట్లు కాగా, ప్రభుత్వ రంగ సంస్థలు (DPSUs) రూ.8,389 కోట్ల విలువైన ఉత్పత్తులను అందించాయి. ముఖ్యంగా DPSUల ఎగుమతి పనితీరు గత ఏడాదితో పోలిస్తే 42.85% పెరగడం భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆమోదాన్ని సూచిస్తోంది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానపరమైన సరళీకరణలు, ఆన్‌లైన్ అనుమతి వేదికలు వంటి అనేక చర్యలు చేపట్టింది. మందుగుండు సామగ్రి, ఆయుధాలు, విడిభాగాలు వంటి అనేక రకాల సైనిక పరికరాలను భారత్ విజయవంతంగా ఎగుమతి చేస్తోంది. ఈ గణనీయమైన వృద్ధి, దిగుమతులపై ఆధారపడే స్థాయి నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీదారుగా, ఎగుమతిదారుగా భారత్ రూపాంతరం చెందుతోందనడానికి నిదర్శనం.
India
Defense Exports
Record Growth
Indian Military
Arms Exports
Make in India
Defense Manufacturing
Atmanirbhar Bharat
Operation Sindhur
DPSUs

More Telugu News