Turkey: డ్రోన్లు మాత్రమే కాదు.. పాక్‌కు టర్కీ సైనిక సాయం? వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు!

Turkey send army to Pakistan
  • భారత్‌పై దాడులకు పాక్‌కు టర్కీ డ్రోన్లు, సైనిక సహకారం
  • 'ఆపరేషన్ సిందూర్'లో ఇద్దరు టర్కీ సైనికుల మృతి చెందినట్లు వార్తలు
  • కూల్చివేసిన డ్రోన్లు టర్కీ 'అసిస్ గార్డ్ సోంగర్' రకానికి చెందినవని నిర్ధారణ
  • పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌కు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బాసట
భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్‌కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా పంపిందన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా, 'ఆపరేషన్ సిందూర్' పేరిట జరిగిన ఘటనల్లో టర్కీకి చెందిన సైనికులు పాల్గొన్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్, టర్కీల మధ్య రక్షణ ఒప్పందాలు ఊపందుకున్నాయి. భారత్‌పై దాడులే లక్ష్యంగా పాకిస్థాన్‌కు టర్కీ వందల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్ల వినియోగంపై పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు టర్కీ సైనిక నిపుణులను ఇస్లామాబాద్‌కు పంపినట్లు వార్తలు తెలుస్తోంది.

'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ జరిపిన ప్రతిదాడుల్లో ఇద్దరు టర్కీ సైనికులు మరణించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఆపరేషన్ అనంతరం పాకిస్థాన్ సుమారు 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంపైకి ప్రయోగించగా, వాటిని భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ డ్రోన్ల శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించగా, అవన్నీ టర్కీకి చెందిన 'అసిస్ గార్డ్ సోంగర్' రకం డ్రోన్లుగా నిర్ధారించారు.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తుంటారని తెలిసిందే. ఆయన అనేక అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించినప్పటికీ, ఎర్డోగాన్ మాత్రం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.

ఉగ్రదాడిని ఖండించకపోగా, మృతుల కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. పహల్గామ్ దాడి అనంతరం ముస్లిం దేశాల్లో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచినవి టర్కీ, అజర్‌బైజాన్ మాత్రమే కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. కశ్మీర్ అంశంలో కూడా ఎర్డోగాన్ పలుమార్లు భారత్‌పై విమర్శలు చేశారు.
Turkey
India
Pakistan
Operation Sindoor

More Telugu News