Chandrababu Naidu: కేంద్ర సాయంతో దుగరాజపట్నంలో రూ.3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం: సీఎం చంద్రబాబు

Rs 3500 Crore Shipbuilding Center in Duggarajapatnam with Central Aid CM Chandrababu
  • తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై చంద్రబాబు సమీక్ష
  • హాజరైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు
  • మారిటైం ప్రాజెక్టులపై చర్చ
సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబాబు అన్నారు. రాష్ట్రంలో 1000 కి.మీ పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని తెలిపారు. రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష చేశారు. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టి.కె. రామచంద్రన్ తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టులు, కొత్తగా నిర్మాణం అవుతున్న పోర్టుల స్థితిగతులపై సమీక్షించారు. తీర ప్రాంతంలో ప్రతి 50 కి.మీ ఒక పోర్ట్ లేదా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనే ఆలోచనతో తాము ఉన్నామని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో నెల్లూరు జిల్లా దుగరాజపట్నంలో పోర్ట్, ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు నాడు కేంద్రం అంగీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ... కొత్త జిల్లా ఏర్పాటుతో తిరుపతి జిల్లా పరిథిలోకి వచ్చిన దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటు అంశంపై వారితో చర్చించారు. 

ఇనిషియల్ ఫీజిబులిటీ రిపోర్ట్ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు. దుగరాజపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతుల క్లస్టర్‌, గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్‌తో కలిపి అభివృద్ది చేస్తారు. 4 డ్రై డాక్‌లు, అవుట్‌ ఫిటింగ్ జెట్టీలు, షిప్ లిఫ్ట్ సౌకర్యం కలిగిన నౌకా నిర్మాణ కేంద్రం ఇక్కడ వస్తుంది. షిప్ బిల్డింగ్ పరిశ్రమకు 1000 ఎకరాలు, అనుబంధ పరిశ్రమలకు మరో 1000 ఎకరాలు భూమి అవసరం ఉంటుంది. 

ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్రం దాదాపు రూ.3,500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతుంది. భూసేకరణతో పాటు పరిశ్రమకు అనువైన ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దుతారు. తరువాత స్పెషల్ పర్మస్ వెహికిల్ (SPV) ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించి ఇక్కడ షిప్ బిల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. నౌకా నిర్మాణ కేంద్రం ద్వారా దాదాపు రూ.26 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ది చేకూరుతుంది. 

ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. దీనికి అవసరమైన కార్యాచరణ వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ పోర్టులో మరింత చౌకగా సరుకు రవాణాకు అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబు కేంద్ర అధికారులను కోరారు. 

అదే విధంగా రాష్ట్రంలో క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సమావేశంలో అధికారులు వివరించారు. పోలవరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో రివర్ క్రూయిజ్ సర్క్యూట్స్ ను అభివృద్ది చేసే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సమీక్షలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Shipbuilding Center
Duggarajapatnam
Andhra Pradesh
Port-based Economy
Maritime Projects
Central Government
Investment
Infrastructure Development
T.K. Ramachandran

More Telugu News