Chandrababu Naidu: ఉద్యానవన సాగుతోనే రైతుకు అత్యధిక ఆదాయం: సీఎం చంద్రబాబు

Andhra CM Chandrababu Naidu on Horticulture Aiming for 1 LakhAcre Income
  • హార్టికల్చర్ శాఖపై సమీక్ష చేపట్టిన సీఎం చంద్రబాబు 
  • ఐదేళ్లలో సాగు రెట్టింపయ్యేలా ప్రణాళికల అమలు 
  • 11 ప్రాధాన్య పంటలు... 24 క్లస్టర్లుగా అభివృద్ధి
  • త్వరలో డ్రిప్ ఇరిగేషన్‌కు ఆటోమెషిన్ పరికరాల ఏర్పాటు
  • పండ్లతోటల రైతులకు సబ్సిడీపై ఫ్రూట్ కవర్ల పంపిణీ
గోదావరి, కృష్ణా డెల్టా మినహా రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ హార్టికల్చర్ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని... రైతుకు ఎకరాకు ఏడాదికి కనీసం లక్ష రూపాయలు ఆదాయం ఆర్జించడమే లక్ష్యం కావాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో అన్నారు. మంగళవారం నాడు సచివాలయంలో హార్టికల్చర్‌పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. మిరప, అరటి, మామిడి, ఆయిల్ పామ్, కోకో, డ్రాగన్ ఫ్రూట్, జీడిమామిడి, కాఫీ, కొబ్బరి, టొమాటో, ఉల్లి వంటి 11 ప్రాధాన్య పంటలతో రాష్ట్రంలో 24 క్లస్టర్లు ఏర్పాటు చేసి రైతులకు తోడ్పాటు అందించాలని చెప్పారు.
 
లక్ష ఎకరాల్లో కోకో సాగుకు చర్యలు

"ప్రస్తుతం రాష్ట్రంలో 18.23 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యానవన సాగును, వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలి. ఆయిల్ పామ్, కోకో, కొబ్బరి పంటల డిమాండ్ దృష్ట్యా రైతులకు ఈ పంటల సాగు విషయంలో అవగాహన కల్పించాలి. ప్రపంచంలో కోకో సాగులో 1 శాతం కన్నా తక్కువగా మన దేశంలో సాగు అవుతోంది. ప్రపంచ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేలా లక్ష ఎకరాల్లో కోకో సాగు చేసేలా చూడాలి. కోకో పంట కోసిన తర్వాత నాణ్యత విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకునేలా శిక్షణ ఇవ్వాలి. అలాగే వీటికి అనుబంధంగా చిన్నతరహాలో ప్రాసెసింగ్ యూనిట్లు రైతులే నెలకొల్పేలా చేస్తే మరింత ఆదాయానికి అవకాశం ఉంటుంది. రైతులు పండించే పంటలకు అధిక విలువ తీసుకురావడంపై దృష్టి పెట్టాలి" అని సీఎం అన్నారు.

మైక్రో ఇరిగేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత 

"మైక్రో ఇరిగేషన్‌కు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీని రాష్ట్రంలో రైతులు వినియోగించుకునేలా చూడాలి. ఎస్సీ, ఎస్టీ, చిన్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇప్పటికే రైతులు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ ఇరిగేషన్‌కు ఆటోమెషిన్ పరికరాలు అమర్చాలి. దీని ద్వారా నీరు, ఎరువులు ఆదా అవుతాయనే విషయం రైతులకు తెలియజేయాలి" అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 

ఫ్రూట్ కవర్ల పంపిణీతో ఉత్తమ ఫలితాలు

మరోవైపు ఉద్యానవనరంగానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ ప్రతి నెలా అన్ని జిల్లాల్లో కాంక్లేవ్‌లు నిర్వహిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అలాగే 10 వేల హెక్టార్లలో పండ్ల సాగు చేస్తున్న రైతులకు రూ.32 కోట్ల వ్యయంతో ఫ్రూట్ కవర్లు సబ్సిడీపై అందించామని, దీంతో రైతులకు రూ.120 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, అగ్రికల్చర్ మిషన్ కార్పొరేషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Horticulture
Agriculture
Farming
Coco farming
Oil Palm
Micro Irrigation
Fruit farming
High income farming

More Telugu News