Mohammad Abdul Hamid: లుంగీతోనే... దేశం విడిచి పారిపోయిన బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు!

Bangladeshs Former President Flees to Thailand
  • హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్
  • రహస్యంగా దేశం విడిచి థాయ్‌లాండ్‌కు పారిపోయినట్లు కథనాలు
  • ఢాకా విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున ప్రయాణం
  • దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
బంగ్లాదేశ్‌ రాజకీయాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమయ్యాక ఆ పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ దేశం విడిచి పారిపోయారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఆయన తెల్లవారుజామున 3 గంటల సమయంలో థాయ్‌లాండ్ విమానం ఎక్కినట్లు సమాచారం అందడంతో తాత్కాలిక ప్రభుత్వం దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

గతవారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 81 ఏళ్ల అబ్దుల్ హమీద్ థాయ్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆయన వెంట సోదరుడు, బావ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో హమీద్ లుంగీ ధరించి విమానాశ్రయానికి వచ్చినట్లుగా ఉన్న దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనపై యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా, మరికొందరిని బదిలీ చేసినట్లు సమాచారం.

అవామీ లీగ్ విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన అబ్దుల్ హమీద్ పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. షేక్ హసీనా ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, 2013 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, గత సంవత్సరం ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో హసీనా ప్రభుత్వం పతనమైంది. అనంతరం మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

ఆ తర్వాత, అవామీ లీగ్ హయాంలో ఆందోళనకారులపై జరిగిన దాడులు, హత్యలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ దర్యాప్తులో భాగంగానే, ఈ ఏడాది జనవరిలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌పై హత్య కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉంటున్నారు. ఇదివరకే షేక్ హసీనా దేశం విడిచి భారత్‌లో తలదాచుకుంటుండగా, ఆమె పార్టీకి చెందిన మిగతా నాయకులు వివిధ కేసుల్లో చిక్కుకున్నారు.

హమీద్ విదేశీ పర్యటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన వైద్య చికిత్స నిమిత్తమే థాయ్‌లాండ్ వెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, హత్య కేసు విచారణ నుంచి తప్పించుకునేందుకే హమీద్ దేశం విడిచి పారిపోయారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బంగ్లాదేశ్ ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అవామీ లీగ్ పార్టీపై, దాని నాయకులపై ప్రత్యేక ట్రైబ్యునల్ విచారణ పూర్తయ్యేవరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Mohammad Abdul Hamid
Bangladesh Former President
Bangladesh Politics
Awami League
Sheikh Hasina
Murder Case

More Telugu News