Bengaluru Techie: హెల్దీ లైఫ్ స్టైల్.. అయినా గుండెలో 80 శాతం బ్లాకేజీ.. షాక్‌లో బెంగళూరు టెకీ

Healthy Lifestyle Yet 80 Heart Blockage Bengaluru Techies Shocking Experience
  • డేటా సైంటిస్ట్‌కు తేలికపాటి గుండెపోటు
  • ఆరోగ్యకర జీవనశైలి, దురలవాట్లు లేకున్నా హార్ట్ ఎటాక్
  • మూసుకుపోయిన గుండె ధమనులు 
  • కొవిడ్ వ్యాక్సిన్ ప్రభావంపై వైద్యుల సందేహాలు
  • యువత ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని బాధితుడి విజ్ఞప్తి
బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల యువ టెక్ నిపుణుడు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ గుండెపోటుకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది. అతడి గుండె ధమనుల్లో ఏకంగా 80 శాతం మూసుకుపోయినట్టు వైద్యులు గుర్తించారు. కొవిడ్ వ్యాక్సిన్ ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని కొందరు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరులోని ఓ ప్రముఖ టెక్ సంస్థలో డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న సదరు యువకుడు ఉద్యోగం విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి లేదని,  ఇంటి నుంచే పనిచేసే అవకాశం ఉండటంతో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే విధులకు కేటాయించేవాడినని తెలిపాడు. మిగిలిన సమయాన్ని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి, శారీరకంగా చురుగ్గా ఉండటానికి ఉపయోగించుకునేవాడినని పేర్కొన్నాడు. క్రమం తప్పకుండా వ్యాయామశాలకు వెళ్లడం, అప్పుడప్పుడు హైకింగ్‌కు వెళ్లడం వంటివి అతని దినచర్యలో భాగం. మద్యం, పొగతాగడం వంటి ఎలాంటి దురలవాట్లు లేవని, ఆహారపు అలవాట్ల విషయంలోనూ నియంత్రణ పాటిస్తానని వివరించాడు.

ఒక రోజు ఛాతీలో అసౌకర్యంగా అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ, ముందు జాగ్రత్తగా వైట్‌ఫీల్డ్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడ వైద్యులు అతడికి తేలికపాటి గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. తాను యుక్తవయసులో ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం, కుటుంబంలో ఎవరికీ గుండె జబ్బులు లేదా మధుమేహం వంటి చరిత్ర లేకపోవడంతో ఆ నిర్ధారణను నమ్మలేకపోయాడు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగి అక్కడి నుంచి వచ్చేశాడు.

అనంతరం ఆస్టర్‌లోని మరో ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు కూడా గుండెపోటును ధ్రువీకరించారు. అతడి గుండె ధమనుల్లో 80 శాతం బ్లాక్ అయ్యాయని తెలిపారు. చికిత్స అందించకపోతే తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి శస్త్రచికిత్స నిర్వహించి స్టెంట్ అమర్చారు.  

ఎలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు లేనప్పటికీ తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆ యువ టెకీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వైరస్ శరీరంలో చురుకుగా ఉన్న సమయంలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుని ఉండటం వల్ల రక్తం గడ్డకట్టి ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని కొందరు వైద్యులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ అనుభవం నేపథ్యంలో యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు.  
Bengaluru Techie
Heart Attack
80% Blockage
Healthy Lifestyle
Covid Vaccine
Heart Disease
Young Adult
Data Scientist
Whitefield Hospital
Aster Hospital

More Telugu News