Chandrababu Naidu: గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu Naidus Key Orders on ST Reservations in Tribal Areas
  • జీవో నెం.3 ను పునరుద్దరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష
  • ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ఆదేశం
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యాయ సమీక్షలో రద్దయిన జీవో నెం.3ను పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో శనివారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకులపై చర్చించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే 2020లో రద్దయిన జీవో నెం.3 పునరుద్ధరణకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

జీవో పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్ష సందర్భంగా జీవో నెం.3 పునరుద్ధరణపై ప్రస్తుతం ఉన్న మూడు అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు వివరించారు.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో గిరిజనుల హక్కులకే కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో జాతీయ స్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. 
Chandrababu Naidu
ST Reservations
Tribal Reservations
Andhra Pradesh
GO No. 3
Agency Areas
Government Jobs
Supreme Court
Constitutional Experts

More Telugu News