Indigo Airlines: భద్రతా కారణాలతో పలు నగరాలకు విమానాలు రద్దు చేసిన ఇండిగో, ఎయిర్ ఇండియా

Indigo  Air India Cancel Flights to Several Cities Due to Security Concerns
  • శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్ సహా పలు నగరాలపై ప్రభావం
  • ఇటీవల తెరిచిన ఎయిర్‌పోర్టులలోనూ రద్దు నిర్ణయం
  • పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సంస్థలు
దేశీయ విమానయాన దిగ్గజాలు ఇండిగో, ఎయిర్ ఇండియా అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దుల్లో భద్రతా కారణాల దృష్ట్యా మంగళవారం పలు కీలక నగరాలకు తమ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్ వంటి నగరాలకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమానాలు ఇందులో ఉన్నాయి. ప్రయాణికుల భద్రతకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు సంస్థలు స్పష్టం చేశాయి.

ఎయిర్ ఇండియా తాము జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్‌లకు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. "తాజా పరిణామాల దృష్ట్యా, మీ భద్రతను దృష్టిలో ఉంచుకుని, మంగళవారం మే 13న ఈ నగరాలకు విమానాలను రద్దు చేశాం. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం, ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తాం" అని ఎయిర్ ఇండియా 'ఎక్స్'  వేదికగా ఒక ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు, ఇండిగో కూడా జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్, లేహ్, శ్రీనగర్, రాజ్‌కోట్‌లకు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం అయినందున’ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో తెలిపింది. "దీనివల్ల మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం కలగవచ్చని అర్థం చేసుకున్నాం, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా బృందాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. తదుపరి సమాచారాన్ని మీకు వెంటనే తెలియజేస్తాం" అని ఇండిగో పేర్కొంది.

భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మూసివేసిన పలు విమానాశ్రయాలను సోమవారమే పౌర విమాన సర్వీసుల కోసం తిరిగి తెరిచారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొత్తం 32 విమానాశ్రయాల్లో  కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. ఇలా తెరిచిన మరుసటి రోజే భద్రతా కారణాలతో శ్రీనగర్, జమ్మూ, అమృత్‌సర్, చండీగఢ్ వంటి కీలక విమానాశ్రయాలకు సర్వీసులను రద్దు చేయడం గమనార్హం. 
Indigo Airlines
Air India
Flight Cancellations
India-Pakistan Border Tension
Jammu
Srinagar
Amritsar
Chandigarh
Leh
Rajkot
Flight Safety
Domestic Flights
Airline News
Travel Disruptions

More Telugu News