Baluch Liberation Army: భారత్ కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ కీలక సూచన

BLA Warns India Against Trusting Pakistan
  • పాకిస్థాన్ ఊసరవెల్లి లాంటిది, దానిని నమ్మొద్దని విజ్ఞప్తి
  • శాంతి, సోదరభావం అంటూ పాక్ చెప్పే మాటలన్నీ మోసపూరితమని మండిపాటు
  • బలూచిస్థాన్ ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బీఎల్ఏ
భారత్, పాక్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. రోజుల తరబడి వినిపించిన కాల్పుల మోతలు, బాంబు పేలుళ్ల శబ్దాలు ప్రస్తుతం వినిపించడం లేదు. అయితే, ఈ ప్రశాంతత తాత్కాలికమేనని, పాకిస్థాన్ ను నమ్మొద్దని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పరోక్షంగా భారత్ కు సూచించింది. పాక్ ఊసరవెల్లిలాంటిదని, దాని మాటలను నమ్మవద్దని పేర్కొంది. భారత సైన్యం ధాటికి తట్టుకోలేక, సైనిక ఘర్షణను ఆపేందుకు పాకిస్థాన్ తాత్కాలిక యుద్ధ వ్యూహంగా ఈ శాంతి, సోదరభావం ప్రవచనాలు చెబుతోందని మండిపడింది. కాల్పుల విరమణ ఒక మోసమని, తాత్కాలికమేనని బీఎల్ఏ పేర్కొంది.

తనపై వస్తున్న ఆరోపణలపైనా బీఎల్ఏ స్పందించింది. విదేశీ మద్దతున్న పార్టీ అంటూ వస్తోన్న విమర్శలను తోసిపుచ్చింది. ‘‘ప్రస్తుతం బలూచిస్థాన్ ప్రాంతానికి సంబంధించి సైనిక, రాజకీయ, వ్యూహాత్మక నిర్మాణంలో మాకు సరైన స్థానం ఉంది. భవిష్యత్తులోనూ ఉంటుంది. మేమేమీ కీలుబొమ్మలం కాదు, ఏం జరిగినా మౌనంగా చూస్తూ ఉండిపోము. బలూచిస్థాన్ లో మా పాత్ర ఏమిటనే దానిపై మాకు పూర్తి స్పష్టత ఉంది’’ అని వెల్లడించింది. పాకిస్థాన్ భూభాగంలోని బలూచిస్థాన్ లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఎడారి వాతావరణం కారణంగా అది అత్యంత వెనుకబడి ఉంది. పాక్ ఖజానాకు గణనీయమైన ఆదాయం ఇక్కడి నుంచే వస్తున్నప్పటికీ బలూచిస్థాన్ అభివృద్ధి విషయంలో పాలకులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో వేర్పాటువాదం పురుడు పోసుకుంది. ప్రత్యేక బలూచిస్థాన్ కోసం స్థానికులు దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తున్నారు.
Baluch Liberation Army
BLA
Pakistan
India
Baluchistan
Ceasefire
Indo-Pak relations
Separatist movement
Political conflict
South Asia

More Telugu News