Celina Jaitely: నా దేశం కోసం నిలబడతా... ఎవరికీ క్షమాపణ చెప్పను: సెలీనా జైట్లీ

Celina Jaitely Defends Her Patriotism
  • భారత సైన్యాన్ని ప్రశంసించిన సెలీనాపై ట్రోల్స్
  • ఉగ్రవాదానికి తాను వ్యతిరేకినన్న సెలీనా
  • ఇష్టం లేని వాళ్లు అన్ ఫాలో కావొచ్చని వ్యాఖ్య
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ, ఇటీవల భారత సాయుధ దళాలను, దేశాన్ని ప్రశంసిస్తూ చేసిన పోస్టులపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ట్రోల్స్‌కు సెలీనా జైట్లీ తనదైన శైలిలో ఘాటుగా బదులిచ్చారు. తాను ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకినేనని, దేశభక్తి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

భారతదేశం పట్ల, ఇక్కడి సాయుధ బలగాల పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ సెలీనా జైట్లీ ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశారు. దీంతో కొందరు వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్‌కు దిగారు. భారత్‌ను పొగిడితే అన్‌ఫాలో చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో, సెలీనా తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తూ తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు.

"భారత్‌ గురించి మాట్లాడితే అన్‌ఫాలో చేస్తామని కొందరు నన్ను బెదిరిస్తున్నారు. అలాంటి వారందరి కోసమే ఈ పోస్ట్‌. నా దేశం కోసం నిలబడినందుకు నేను ఎప్పటికీ ఎవరికీ క్షమాపణలు చెప్పను" అని సెలీనా తన ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదం పేరిట అమాయకుల ప్రాణాలను బలిగొంటుంటే తాను మౌనంగా ఉండలేనని ఆమె తేల్చిచెప్పారు. "ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీశారు. హింసను సమర్థిస్తూ, దాన్ని ప్రోత్సహించే వారివైపు నేను ఎప్పుడూ నిలబడను" అని ఆమె స్పష్టం చేశారు.

భారత్‌పై తనకున్న ప్రేమ ఇతరులను బాధిస్తే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాను చేసే వ్యాఖ్యలు వినలేకపోతే, సోషల్ మీడియాలో తనను అనుసరించడం మానేయవచ్చని సెలీనా సూటిగా చెప్పారు. "నేను శాంతి కోసం మాట్లాడతాను. సత్యం కోసం నిలబడతాను. ఎప్పుడూ నా సైనికుల వెంటే ఉంటాను. ఎందుకంటే నా సైనికులు పేరు, మతం అడగకుండానే రక్షిస్తారు. మీ అందరి ట్రోల్స్‌, బెదిరింపులు నేను గమనిస్తూనే ఉన్నాను. నేను ఇలాంటి వారిని క్షమించను. జైహింద్‌" అంటూ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు.

గతంలో 'ఆపరేషన్‌ సిందూర్‌' గురించి ప్రస్తావిస్తూ సెలీనా ఒక పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ, తన మనసంతా భారతదేశం గురించే ఆలోచిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న పోరాటాలను, వారి త్యాగాలను ఆమె ప్రశంసించారు. కోట్లమంది ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది సైనికుల వల్లే సాధ్యమని ఆమె కొనియాడారు.
Celina Jaitely
Bollywood Actress
India
Indian Armed Forces
Patriotism
Social Media
Trolling
Controversy
Operation Sindhura
Nationalism

More Telugu News