Chandrababu Naidu: దేశాన్ని రక్షించే శక్తి మోదీ.. దేశం యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోంది: చంద్రబాబు

Chandrababu Naidu Praises Modis Leadership Amidst Rising Tensions
  • ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశానికి భద్రత అన్న చంద్రబాబు
  • ఉగ్రదాడులతో దేశం దిగ్భ్రాంతికి గురైందన్న సీఎం
  • వీరమరణం పొందిన సైనికుడు మురళీ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని హామీ
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని చాయాపురంలో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, దేశం ప్రస్తుతం ఒకరకమైన యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. ఉగ్రవాదుల దాడులతో దేశ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గామ్‌లో అమాయకులైన మన వారిని ఉగ్రవాదులు దారుణంగా హతమార్చడం అత్యంత విచారకరమని పేర్కొన్నారు. భారతదేశం ఎల్లప్పుడూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రపంచంలో ఎక్కడా హింసకు తావులేదని ప్రధాని పదేపదే స్పష్టం చేస్తుంటారని గుర్తుచేశారు.

పాకిస్థాన్ నిరంతరం మన దేశంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ, దాడులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. దేశ రక్షణ కోసం ఎంతో మంది యువకులు సైన్యంలో చేరుతున్నారని, వారి త్యాగాల వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా, ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన తెలుగు బిడ్డ, సైనికుడు మురళీ నాయక్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులతో తాను మాట్లాడి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశానని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. అనంతరం, చంద్రబాబు "భారత్ మాతాకీ జై" అంటూ నినాదాలు చేశారు. వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. 
Chandrababu Naidu
Narendra Modi
India-Pakistan relations
Terrorism
Pulwama attack
Indian Army
National Security
Murali Naik
Andhra Pradesh

More Telugu News