Indian Army Chief: ఆర్మీ చీఫ్‌కు కేంద్రం కీలక అధికారాలు... ఏమిటీ టెరిటోరియల్ ఆర్మీ?

Indian Army Chief Gets Key Powers Amidst Pakistan Tensions
  • పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌కు కేంద్రం అదనపు అధికారాలు
  • అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీ వినియోగం
  • రెగ్యులర్ సైన్యంతో కలిసి పనిచేయనున్న వాలంటరీ దళాలు
  • 1949 నుంచి సేవలందిస్తున్న టెరిటోరియల్ ఆర్మీ
పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రక్షణ వ్యూహంలో భాగంగా, అవసరమైన సందర్భాల్లో టెరిటోరియల్ ఆర్మీ సేవలను వినియోగించుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు మరిన్ని అధికారాలను కట్టబెడుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 'ఆపరేషన్ సింధూర్' పేరిట పాక్ కుతంత్రాలను తిప్పికొట్టేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పాకిస్థాన్ వైపు నుంచి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయగా వాటిని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ సరిహద్దుల్లో మరిన్ని అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నుతోందన్న నిఘా సమాచారంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా, భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. అవసరమైతే, టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని స్పష్టం చేసింది. ఇందులోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని తక్షణమే విధుల్లోకి పిలిపించి, రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేలా ఆదేశించే అధికారాన్ని ఆర్మీ చీఫ్‌కు అప్పగించింది.

టెరిటోరియల్ ఆర్మీ అంటే?

టెరిటోరియల్ ఆర్మీని క్లుప్తంగా 'సైనిక రిజర్వ్ దళం' అని చెప్పవచ్చు. దేశానికి క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు, సాధారణ సైన్యానికి మద్దతుగా నిలిచేందుకు ఈ దళాలు సిద్ధంగా ఉంటాయి. వీరికి కూడా రెగ్యులర్ సైనికులతో సమానంగా కఠినమైన శిక్షణ ఇస్తారు. అయితే, వీరు నిరంతరం సైన్యంతో ఉండరు. తమతమ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే, స్వచ్ఛందంగా దేశసేవలో పాలుపంచుకుంటారు. 1948లో భారత టెరిటోరియల్ ఆర్మీ చట్టాన్ని ఆమోదించగా, 1949లో ఇది అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ దళంలో సుమారు 50 వేల మంది క్రియాశీలకంగా ఉన్నట్లు అంచనా.

గతంలో 1962, 1965, 1971 యుద్ధ సమయాల్లో టెరిటోరియల్ ఆర్మీ భారత రెగ్యులర్ ఆర్మీతో కలిసి పోరాడింది. కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ఈ దళాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటాయి. ఇటీవల కేరళ వరదల సమయంలో ప్రముఖ నటుడు మోహన్‌లాల్, టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా తనవంతు సేవలు అందించడం గమనార్హం.

ధోనీ, కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, అనురాగ్ ఠాకూర్, సచిన్ పైలట్ లెఫ్టినెంట్ కర్నల్ స్థాయి అధికారులు

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ వంటి పలువురు ప్రముఖులు కూడా టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ హోదాలు కలిగి ఉన్నారు. నిర్దిష్ట కాలంపాటు సేవలు అందించిన వారికి పింఛను, ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్, వైద్య సదుపాయాలు, ఎల్‌టీఏ) కూడా వర్తిస్తాయి. టెరిటోరియల్‌ ఆర్మీకి చెందిన అనేక మంది అధికారులు శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్నారు.
Indian Army Chief
Territorial Army
India Pakistan Border
Operation MS Dhoni
Kapil Dev
Abhinav Bindra
Anurag Thakur

More Telugu News