PSL: పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ వేదిక మార్పు

Pakistan Super League Moves to UAE Due to Security Concerns
  • భార‌త్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త పరిస్థితులు
  • పీఎస్ఎల్‌ పాక్ నుంచి యూఏఈకి త‌ర‌లింపు
  • ఈ మేర‌కు పీసీబీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
భార‌త్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త పరిస్థితుల నేప‌థ్యంలో పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పీఎస్ఎల్‌ను పాక్ నుంచి యూఏఈకి త‌ర‌లిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. లీగ్‌లో మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల‌ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. 

పాక్‌పై భారత దాడులు, రావల్పిండి స్టేడియం స‌మీపం వ‌ర‌కు చేరుకున్న డ్రోన్ నేప‌థ్యంలో పాకిస్థాన్ టీ20 క్రికెట్ లీగ్ ను యూఏఈకు తరలిస్తున్న‌ట్లు పీసీబీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆట‌గాళ్ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్లడించారు. ఫ్రాంచైజీల ఓన‌ర్లు, పీసీబీ చైర్మన్, దేశ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ మధ్య ప‌లు సమావేశాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గురువారం ఉదయం రావల్పిండి నగరంలోని స్టేడియం సమీపంలో ఒక డ్రోన్‌ సహా 28 భారతీయ డ్రోన్‌లను పాకిస్థాన్ సైన్యం అడ్డుకుంద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. ఇది "దేశీయ, విదేశీ క్రికెట్ ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునే ఉద్దేశపూర్వక ప్రయత్నం" అని ఆయ‌న పేర్కొన్నారు.

కరాచీ కింగ్స్, పెషావర్ జల్మి జ‌ట్లు గురువారం రావల్పిండి స్టేడియంలో ఆడాల్సి ఉండగా... స్టేడియం సమీపంలో డ్రోన్ పడటంతో మ్యాచ్ వాయిదా పడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌లకు చెందిన 37 మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్‌ లీగ్‌లో పాల్గొంటున్నారు. వారి భ‌ద్ర‌తా దృష్ట్యా లీగ్‌ను యూఏఈకి త‌రలిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీసీబీ వెల్ల‌డించింది.  
PSL
Pakistan Super League
Pakistan Cricket Board
PCB
UAE
India-Pakistan tensions
Security concerns
International cricketers
Mohsin Naqvi
Ishaq Dar

More Telugu News