Vyomika Singh: మరోసారి మీడియా ముందుకు వచ్చిన వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ

Vyomika Singh  Sofia Qureshi Address Media on Pakistan Cross Border Firing
షార్ట్స్‌లో చూడండి
సరిహద్దు గ్రామాల ప్రజలపై కాల్పులు జరిపి 16 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నందునే ఇవాళ పాకిస్థాన్ పై దాడులు చేయాల్సి వచ్చిందని భారత వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్, పీవోకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి విజయవంతం కాగా, ఈ సాహసోపేత ఆపరేషన్ కు ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వాయుసేన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వం వహించారు. ఆపరేషన్ అనంతరం వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇవాళ, పాక్ పై ఆపరేషన్ సిందూర్ 2.0 అనంతరం వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం తన దుందుడుకు చర్యలను మరింత తీవ్రతరం చేసిందని, అకారణంగా జరుపుతున్న కాల్పుల కారణంగా ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులతో సహా మొత్తం 16 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. పాకిస్థాన్ దుశ్చర్యలకు భారత సైనిక దళాలు ధీటుగా ప్రతిస్పందించాయని వారు తెలిపారు.

"జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మేంధార్ మరియు రాజౌరి సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే మోర్టార్లు, భారీ శతఘ్నులతో కాల్పుల తీవ్రతను గణనీయంగా పెంచింది" అని తెలిపారు. ఈ కాల్పుల వల్ల అమాయకులైన పౌరులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాకిస్థాన్ సైన్యం జరుపుతున్న ఈ అకారణ కాల్పులను అడ్డుకోవడానికి, వారి మోర్టార్ మరియు శతఘ్నుల దాడులను నిలువరించడానికి భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిస్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. "పాకిస్థాన్ నుంచి వస్తున్న కాల్పులను ఆపడానికే భారత సైన్యం చర్యలు తీసుకుంది" అని వివరించారు.

అయితే, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చకూడదనే నిబద్ధతతో భారత సాయుధ దళాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. "పాకిస్థాన్ సైన్యం సంయమనం పాటిస్తూ, ఒప్పందాలను గౌరవిస్తే, మేము కూడా ఉద్రిక్తతలను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోము" అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతిని కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల భద్రతను కాపాడుకోవడంలో రాజీపడే ప్రసక్తే లేదని పరోక్షంగా హెచ్చరించారు.
Go Back to Shorts
Vyomika Singh
Sofia Qureshi
Indian Air Force
Operation Sindhu
Pakistan
LOC firing
Jammu and Kashmir
Cross border firing
Indian Army
Surgical Strike

More Telugu News