Pakistan shelling: మా ఇళ్లు, దేవాలయాలు, మసీదులు, స్కూళ్లను కూడా వదల్లేదు.. పాక్ షెల్లింగ్‌పై సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదన

Homes Temples Mosques Destroyed in Pakistans Cross Border Firing
  • భయంతో ఊర్లు ఖాళీ చేస్తున్న గ్రామస్థులు
  • ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ ప్రతీకార దాడులు
  • యుద్ధభూమిని తలపిస్తున్న సరిహద్దు గ్రామాలు
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' అనంతరం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ సైన్యం బుధవారం జరిపిన భీకర దాడులు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపైనా పాక్ సైన్యం షెల్లింగ్‌కు పాల్పడింది. గురువారం కూడా కాల్పులు కొనసాగినప్పటికీ, బుధవారంతో పోలిస్తే తీవ్రత తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.

పూంచ్ పట్టణంలో నివసించే స్థానిక ఎమ్మెల్యే అజాజ్ జాన్ మాట్లాడుతూ పాక్ సైన్యం భారీ ఫిరంగి దాడులకు పాల్పడటంతో మొత్తం పట్టణం యుద్ధ క్షేత్రాన్ని తలపించిందని స్థానిక వార్తాసంస్థ 'గ్రేటర్ కశ్మీర్'కు తెలిపారు. "సుమారు ఆరు గంటల పాటు పూంచ్ పట్టణంపై తీవ్రస్థాయిలో ఫిరంగి దాడులు జరిగాయి. వందలాది షెల్స్ పట్టణంలో పడ్డాయి. ఆ భయాన్ని, దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు లేవు. మా ప్రైవేటు పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, మదర్సాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ లైన్స్, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్‌లు అన్నీ దాడులకు గురయ్యాయి" అని వివరించారు.

ఉత్తర కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో, నియంత్రణ రేఖకు కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సలామాబాద్ గ్రామం పాక్ షెల్లింగ్‌తో తీవ్రంగా ప్రభావితమైంది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పెద్ద పేలుడు శబ్దంతో గ్రామస్థులు ఉలిక్కిపడి లేచారని స్థానిక దుకాణదారుడు బషీర్ అహ్మద్ బీబీసీకి తెలిపారు. సలామాబాద్‌లోని సుమారు 100 మంది నివాసితులలో చాలా తక్కువ మంది మాత్రమే మిగిలి ఉన్నారని, మిగతావారు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారని అహ్మద్ పేర్కొన్నారు. ఇంతటి తీవ్రమైన షెల్లింగ్ తాను చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నానని ఆయన అన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం జరిగిన పాక్ దాడుల్లో సలామాబాద్‌లోని రెండు ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇదే గ్రామానికి చెందిన బద్రుద్దీన్ మాట్లాడుతూ, తాను, తన ఎనిమిదేళ్ల కుమారుడు, వదిన షెల్లింగ్‌లో గాయపడ్డామని బీబీసీకి తెలిపారు. "మా ఇల్లు కూడా దెబ్బతింది. అంతా పోయింది. తిరిగి వెళ్లాలంటే భయంగా ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకు సహాయం చేయాలి" అని కోరారు. "ఒకటి కాదు, అనేక షెల్స్ పడ్డాయి. చెవులు చిల్లులుపడే శబ్దాలు. చాలా భయంగా ఉంది, కానీ మేం ఎక్కడికి వెళ్లగలం? పేదవాళ్లు ఎక్కడికి పోతారు? మా దగ్గర ఏమీ లేదు" అని మరో వ్యక్తి తన ఆవేదనను వెళ్లగక్కారు.
Pakistan shelling
Jammu and Kashmir
LOC firing
Operation Sundar
Border villages
Aijaz Jan
Basher Ahmad
Badruddin
Civilian casualties
India-Pakistan conflict

More Telugu News