YS Jagan Mohan Reddy: ఈరోజు బెంగళూరుకు వెళ్లనున్న జగన్

Jagan going to Bengaluru today
  • ఈరోజు తాడేపల్లిలోని కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న జగన్
  • సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో, ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీకి అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలానికి చెందిన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో పాటు ఆయా జిల్లాల ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.

ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకున్న అవిశ్వాస తీర్మానాలు, తాజా రాజకీయ పరిణామాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఈ అంశాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమావేశం ముగిసిన తర్వాత జగన్ సాయంత్రం బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనం కానున్నారు. రాత్రి 8.00 గంటలకు ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

YS Jagan Mohan Reddy
YCP
Andhra Pradesh Politics
Bengaluru Trip
Political Meeting
TDP
Local Body Elections
No Confidence Motion
Andhra Pradesh
India Politics

More Telugu News