Colonel Sofia Khureshi: తొలిసారిగా మహిళా సైనికాధికారులతో బ్రీఫింగ్.. కారణం ఇదేనా?

First Ever Women Officers Briefing Indias Response to Terror
  • పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడుల అనంతరం మీడియా సమావేశం
  • ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాలు వెల్లడి
  • దేశ చరిత్రలో తొలిసారి మహిళా అధికారులు కీలక సైనిక చర్యపై బ్రీఫింగ్
  • 'ఆపరేషన్ సింధూర్' పేరిట మహిళాశక్తికి ప్రాధాన్యం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్, బైసరన్ అడవుల్లో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనకు ప్రతీకారంగా, భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారుజామున దాడులు నిర్వహించింది. ఈ దాడులకు సంబంధించిన అధికారిక మీడియా సమావేశంలో ఇద్దరు మహిళా సైనికాధికారులు పాల్గొని వివరాలు వెల్లడించడం భారత సైనిక చరిత్రలోనే ఒక నూతన అధ్యాయనంగా నిలిచింది. ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, వాయుసేనకు చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌కు 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టడం కూడా మహిళా శక్తికి ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తోంది.

పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులు మహిళల కళ్లెదుటే వారి భర్తలను చంపారు. మహిళలను చంపకుడా వదిలిపెట్టి, భారత ప్రభుత్వానికి తమ సందేశాన్ని చేరవేయమని వ్యంగ్యంగా చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే... కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మహిళా సైనికాధికారులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. దేశాన్ని బెదిరించే వారిని భారత మహిళలు వదిలిపెట్టరనే బలమైన సందేశాన్నిఈ మీడియా సమావేశం ద్వారా పంపింది. 

ఇద్దరు మహిళా అధికారులు ఎంతో ఆత్మవిశ్వాసంతో, అధికారికంగా మాట్లాడిన తీరు ఉగ్రవాదంపై పోరాడాలన్న దేశ సంకల్పాన్ని, పహల్గామ్ మారణకాండకు అన్ని విధాలా తగిన సమాధానాన్ని ప్రతిబింబించింది. ఉగ్రవాదులు మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని చూశారని, ఈ ఇద్దరు అధికారులు భారత్ ప్రతీకారం గురించి ప్రపంచానికి వివరించడం, పాక్ గురించి అదనంగా ఒక్క మాట మాట్లాడకుండానే శక్తివంతమైన సందేశాన్ని పంపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సాయుధ దళాలకు ప్రాతినిధ్యం వహించడానికి ఈ ఇద్దరు మహిళా అధికారులను ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేయడం, భారతదేశ వ్యూహాత్మక కార్యాచరణలో భాగంగా కనిపిస్తోంది. దేశ ప్రతిస్పందనలో మహిళలు ముందంజలో ఉన్నారనే సందేశం స్పష్టంగా వెళ్లింది. ఇక, సోషల్ మీడియాలో అయితే ఈ ఇద్దరు మహిళా ఆపీసర్ల మీడియా సమావేశాన్ని వేనోళ్ల కీర్తిస్తున్నారు. 
Colonel Sofia Khureshi
Wing Commander Vyomika Singh
Indian Army
Pakistan
Jammu and Kashmir
Terrorism
Operation Sindhoor
Women in Military
Media Briefing
Pahalgham Attack

More Telugu News