Operation Sindhoor: ‘ఆపరేషన్ సిందూర్’.. 80 మంది ఉగ్రవాదుల హతం!

Operation Sindhoor Over 80 Terrorists Killed in Pakistan
  • పాక్, పీవోకేలోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సాయుధ బలగాల మెరుపుదాడులు
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా జైషే, లష్కరే, హిజ్బుల్ టెర్రర్ క్యాంపులే లక్ష్యం
  • బహవల్పూర్, మురిడ్కే స్థావరాల్లోనే 50-60 మంది ఉగ్రవాదులు హతం
  • భారత్ 'న్యాయం జరిగింది' అంటే.. 'యుద్ధ చర్య' అంటున్న పాక్
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడ్డాయి. 'ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన ఈ కచ్చితమైన దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు అత్యున్నత స్థాయి భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన మొత్తం తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. పహల్గామ్‌లో 26 మంది అమాయక పౌరుల మృతికి కారణమైన దాడికి ప్రతిచర్యగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది.

అధికార వర్గాల సమాచారం ప్రకారం.. జైషే మహమ్మద్‌కు బలమైన పట్టున్న బహవల్పూర్, లష్కరే తోయిబా కీలక కేంద్రమైన మురిడ్కేలోని మసీద్ వా మర్కజ్ తైబాపై జరిగిన దాడుల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారు 25 నుంచి 30 మంది చొప్పున ఉగ్రవాదులు హతమైనట్లు అంచనా. మురిడ్కేలోని స్థావరం పాకిస్థాన్‌లో ‘ఉగ్రవాద నర్సరీ’గా, లష్కరే సైద్ధాంతిక ప్రధాన కార్యాలయంగా దీర్ఘకాలంగా పరిగణిస్తున్నారు. లక్షిత దాడులకు గురైన ఇతర ప్రాంతాల్లో మృతుల సంఖ్యను నిఘా సంస్థలు ఇంకా ధ్రువీకరిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం మొత్తం 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారని భావిస్తున్నారు.

ఈ దాడుల్లో ఉగ్రవాదులను సరిహద్దు దాటించేందుకు వినియోగించే లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలు, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే కేంద్రాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన జైషే మహమ్మద్, లష్కరే తోయిబా సంస్థలే ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి.

దాడుల అనంతరం, భారత సైన్యం ‘ఎక్స్’లో ఒక వీడియోను విడుదల చేస్తూ ‘న్యాయం జరిగింది’ అని ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే, ఈ దాడులను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. ఇది ‘నిస్సిగ్గుగా చేసిన యుద్ధ చర్య’ అని అభివర్ణించింది. ఈ దాడుల్లో ఒక చిన్నారితో సహా ఎనిమిది మంది పౌరులు మరణించారని ఆరోపించింది.

లక్షిత దాడులకు గురైన ఇతర ప్రాంతాలలో జైషే మహమ్మద్‌కు చెందిన తెహ్రా కలాన్‌లోని సర్జల్, కోట్లీలోని మర్కజ్ అబ్బాస్, ముజఫరాబాద్‌లోని సయ్యద్నా బిలాల్ క్యాంప్ ఉన్నాయి. అలాగే, లష్కరే తోయిబాకు సంబంధించిన బర్నాలాలోని మర్కజ్ అహ్లే హదీస్, ముజఫరాబాద్‌లోని శ్వవాయ్ నల్లా క్యాంప్‌లపై కూడా దాడులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన కోట్లీలోని మకజ్ రహీల్ షాహిద్, సియాల్‌కోట్‌లోని మెహమూనా జోయా శిక్షణ కేంద్రాలు కూడా ధ్వంసమైన వాటిలో ఉన్నాయి.

మొత్తం తొమ్మిది లక్షిత స్థావరాల్లో నాలుగు పాకిస్థాన్ భూభాగంలో ఉండగా, మిగిలిన ఐదు పీవోకేలో ఉన్నాయి. ఈ దాడుల్లో పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఉగ్రవాద శిక్షణ మౌలిక సదుపాయాలకు పాక్ సైన్యం, ఐఎస్ఐ, స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) వర్గాలు మద్దతునిస్తున్నాయని ఆరోపణలున్నాయి.

ఈ దాడుల అనంతరం, పాకిస్థాన్ దళాలు జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి భారీగా కాల్పులకు, మోర్టార్ల దాడులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు భారతీయ పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు. భారత భద్రతా దళాలు కూడా దీటుగా స్పందించాయి. తాజా సమాచారం అందేసరికి ఇరువైపులా కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.
Operation Sindhoor
India-Pakistan Conflict
Jammu and Kashmir
Terrorist Camps
Jaish-e-Mohammed
Lashkar-e-Taiba
Hizbul Mujahideen
POK
Cross-border Firing
Surgical Strikes

More Telugu News