Uday Kotak: రియల్ ఎస్టేట్ రంగంలో ఇది సరికొత్త రికార్డు .. చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు

Uday Kotak Sets New Record with Rs 275 Lakhsq ft Apartment Purchase
  • ముంబయిలో ఒక అపార్ట్‌మెంట్ భవంతికి ఏకంగా రూ.400 కోట్లకుపైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఉదయ్ కోటక్
  • చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలుగా నమోదు
  • ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన వర్లీ సీ – ఫేస్‌లో రికార్డు ధరతో కొనుగోలు చేసిన వైనం
దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, కోటక్ మహీంద్ర బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ ఉదయ్ కోటక్.. ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన వర్లీ సీ-ఫేస్‌లో ఒక అపార్ట్‌మెంట్ భవంతిని ఏకంగా రూ.400 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేశారు. దీంతో ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు పలికినట్లు అయింది. ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డుల్లోకి ఎక్కింది.

కోటక్ కుటుంబం ఇప్పటికే ఈ అపార్ట్‌మెంట్‌లోని 24 ఫ్లాట్లలో 13 ప్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ప్లాట్లను రూ.131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో ప్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ.12 కోట్ల నుంచి రూ.27.59 కోట్లుగా ఉంది. మిగిలిన మూడు ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా మొత్తం భవనం విలువ రూ.400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది.

ఈ భవనంలో అత్యంత చిన్నదైన 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ.4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చదరపు అడుగుల ఫ్లాట్ ధర రూ.38.24 కోట్లుగా నమోదైంది. ఇది ముంబయిలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం, ముంబయి తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది. అయితే, ఈ తాజా డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ ఫ్యామిలీ అధికారికంగా వెల్లడించలేదు. 
Uday Kotak
Real Estate
Mumbai
Worli Sea-Face
Luxury Apartment
Record Price
Indian Real Estate
Property
Apartment Purchase
Billionaire

More Telugu News